
హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' అక్టోబర్ 1న ధియేటర్లలో విడుదల కానుంది. తమిళనాడులో ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ విడుదల చేస్తున్నట్టు ధనుష్ 'ఎక్స్'లో వెల్లడించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థను ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ స్థాపించారు. సినిమాల నిర్మాణం, పంపిణీ చేస్తుంటుంది రెడ్ జెయింట్ మూవీస్. అయితే తాజా ప్రకటనలో ఉదయనిధి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్బన్ ఉదయనిధిని (Inban Udhayanidhi) సమర్పకుడిగా అందులో పేర్కొన్నారు. రెడ్ జెయింట్ మూవీస్ కొత్త సీఈవో అతడేనని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి గురించి ఆరా మొదలైంది.
ఎవరీ ఇన్బన్?
ఇన్బన్ ఉదయనిధి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధినేత కరుణానిధి (Karunadhini) ముని మనవడు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మనవడు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు. చిన్న వయసులోనే రెడ్ జెయింట్ మూవీస్ సీఈవోగా బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ఉదయనిధి 2002లో కిరుతిగను వివాహం చేసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలు ఇన్బన్, తన్మయ. ప్రస్తుతం ఇన్బన్ వయసు 20 ఏళ్లు.
రొనాల్డో ప్రేరణతో..
ఫుట్‌బాల్ ఆటగాడైన ఇన్బన్.. భారత ఫుట్‌బాల్ క్లబ్ నెరోకాతో డిఫెండర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రేరణతో అతడు ఫుట్‌బాట్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ టీమ్‌కు వీరాభిమాని అని టైమ్స్ ఇండియా వెల్లడించింది. 'రొనాల్డో ఆటలో దూకుడు, అకింతభావం అంటే నాకెంతో ఇష్టం. రియల్ మాడ్రిడ్ మిడ్‌ఫీల్డర్లు లూకా మోడ్రిక్, సెమిరో తమ జట్టు కోసం పడే శ్రమ నన్ను ఆకట్టుకుంది. రియల్ మాడ్రిడ్ (Real Madrid) మ్యాచ్‌లన్నీ చూస్తాను. వారి ప్రత్యర్థుల మ్యాచ్‌లను కూడా చూస్తాన'ని అతడో సందర్భంలో చెప్పాడు.
ప్రేమించడానికి భయపడొద్దు
సినిమా పరిశ్రమలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే ఇన్బన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతితో తాను కలిసివున్న ఫొటోలు 2023లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎదుర్కొన్నాడు. అయితే దీని గురించి అతడు ఎక్కడా మాట్లాడలేదు. ఇన్బన్ తల్లి కిరుతిగ ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) మాత్రం ట్విటర్‌లో నర్మగర్భంగా స్పందించారు. 'ప్రేమించడానికి, దాన్ని వ్యక్తీకరించడానికి భయపడవద్దు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గం' అంటూ ఆమె ట్వీట్ చేశారు. కొడుకును వెనుకేసుకొచ్చేలా కిరుతిగ ట్వీట్ ఉందని అప్పట్లో జనాలు అనుకున్నారు.
చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత
హీరో ధనుష్ విషెష్
ఇన్బన్ తండ్రి ఉదయనిధి 2012లో 'ఒరు కల్ ఒరు కన్నడి' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తన కుమారుడికి జెయింట్ మూవీస్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఘనమైన వారసత్వాన్ని కలిగిన ఇన్బన్ ఎలా ముందుకెళతాడో చూడాలి. కాగా, కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఇన్బన్‌కు హీరో ధనుష్ (Hero Dhanush) శుభాకాంక్షలు తెలిపారు.
రెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానం
రెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానం 2008లో ప్రారంభమైంది. విజయ్- త్రిష కాంబినేషన్‌లో ధరణి తెరకెక్కించిన కురువి సినిమాను ప్రొడక్షన్ హౌస్ మొదట నిర్మించింది. తర్వాత ఆధవన్ (2009), మన్మధన్ అంబు (2010), 7 ఓమ్ అరివు (2011), ఒరు కల్ ఒరు కన్నాడి (2012), నీర్‌పరావై (2012), వణక్కం చెన్నై (2013), మనితన్ (2016), మామన్నన్ (2023) సినిమాలను నిర్మించింది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిల్లై, కమల్ హాసన్-మణిరత్నంల థగ్ లైఫ్ సినిమాలను ఈ ఏడాది విడుదల చేసింది. ఇడ్లీ కడై సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతోంది.
IdliKadai – releasing across Tamil Nadu by @RedGiantMovies_
Wishing Inban Udhayanidhi the very best on his new journey! pic.twitter.com/gFUTJgbFwm— Dhanush (@dhanushkraja) September 3, 2025