బిహార్ ఎన్నికల ఫలితాలపై జన సూరజ్ పార్టీ అధినేత విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు రూ. 10 వేల చొప్పున అకౌంట్లలో వేయకపోతే జేడీయూ పార్టీకి ఖచ్చితంగా 25లోపు సీట్లు వచ్చేయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల హామీని కూటమి ప్రభుత్వం నెరవేరిస్తే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు.
జేడీయూ పార్టీ మహిళలలకు రూ. 2లక్షలు ఇస్తానని ఆశజూపి ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలలో తొలివిడతగా రూ.10 వేలు జమచేసిందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇలా ఒక్కో నియోజకవర్గానికి 10 వేల నుండి 60 వేల మంది వరకూ డబ్బులు జమచేసిందన్నారు. ఒక వేళ ఆ విధంగా చేయకుంటే తాను అంచనా వేసిన విధంగా జేడీయూకి 25 సీట్లు దాటేవి కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాది కార్యక్రమాలకు గానూ రూ. 2 లక్షలు ఖాతాల్లో జమ చేస్తానని హామీ ఇచ్చిందని తెలిపారు ఒకవేళ ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన విధంగా 1.5 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఆ డబ్బులు చెల్లిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు.
ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కనీసం ఒక్కచోట కూడా జన సూరజ్ పార్టీ విజయం సాధించలేదు దీంతో ప్రశాంత్ కిషోర్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బిహార్ ఎన్నికల్లో ఓటమికి తానే పూర్తిస్థాయి బాధ్యత వహిస్తున్నానని ఎన్నికల్లో గెలవడానికి సిరీయస్‌గా కష్టపడ్డప్పటికీ ఓట్లు సాధించడంలో విఫలమయ్యామన్నారు. అందుకు గానూ తనను క్షమించాలని కోరారు.
దేశవ్యాప్తంగా ఓట్లచోరీ జరుగుతుందని ఈ విషయమై జాతీయ పార్టీలంతా చర్చలు జరపాలని అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పీకే కోరారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా 6 నెలల్లో మహిళల రూ. 2లక్షలు జమచేయకపోతే జన సూరజ్ పార్టీ వారి పక్షాన పోరాడుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.


