గతంలో ఎక్కువగా వృద్ధులకే పరిమితం
ఇప్పుడు స్ట్రోక్‌వచ్చేవారిలో 15–20 శాతం మంది 45 ఏళ్లలోపు వారే...
దేశంలో ఏటా 15–18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదు
జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి నిర్ధారణ కానిపరిస్థితులే కారణం
పలు అధ్యయనాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : భారత యువతలో గుండెపోటు ప్రమాదం ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోంది. గతంలో 50–60 ఏళ్లకు పైబడిన వారికే హార్ట్‌స్ట్రోక్స్ పరిమితమయ్యేవి. అందుకు భిన్నంగా ఇప్పుడు 45 ఏళ్లలోపు వారు 15–20 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం 45 ఏళ్లలోపు వారిలో ఇంతకంటే తక్కువ స్ట్రోక్ కేసులు సంభవిస్తున్నాయి. నగరాల్లో ఐటీ ఉద్యోగులు, నిపుణులు, అధిక స్క్రీన్ సమయం గడుపుతున్న విద్యార్థులు ముందస్తు వాస్కులర్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం 25–40 ఏళ్ల మధ్యలోని పురుషులు, మహిళలు గుండె సమస్యలకు గురవుతున్నారు. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు జన్యుపరంగా హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2023 లాన్సెట్ నివేదిక, ఇతర తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే.. భారత్‌లో ఏటా 15–18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మరణాలకు రెండో ప్రధాన కారణం, వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా గుండెపోట్లు నిలుస్తున్నాయి.
ప్రమాదకారకాలపై నిపుణుల మాట
» ఆధునిక జీవనశైలి మన శరీరం కంటే వేగంగా మన ధమనులను వృద్ధాప్యం బారిన పడేలా చేస్తోంది.
» మధుమేహం, అధిక రక్తపోటు,ధూమపానం, వాయు కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు దీని పెరుగుదలకు కారణమవుతున్నాయి.
» స్లీప్ అప్నియా–స్ట్రోక్ మధ్య బలమైన సంబంధం ఉంది. స్ట్రోక్‌తో బాధపడుతున్న వారిలో దాదాపు 50–70 శాతం మందికి స్లీప్ అప్నియా కూడా ఉంటుంది. ఈ పరిస్థితి ఒక వ్యక్తి రాత్రిపూట గురక పెట్టడానికి, పదేపదే మేల్కొనడానికి కారణమవుతుంది. దీని వలన ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి, రక్త నాళాలపై ఒత్తిడి వస్తుంది.
» ప్రారంభ స్ట్రోక్ తర్వాత చికిత్స చేయకపోతే, రెండేళ్లలోపు పునరావృతమయ్యే అవకాశం 50 శాతం ఉంటుంది.
ప్రతి నిమిషం విలువైనది
యువ భారతీయుల జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వారిని మరింతప్రమాదంలో పడేస్తున్నాయని కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్‌తో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు మిలియన్ల మెదడు కణాలు వేగంగా చనిపోతాయి కాబట్టి ఈ లక్షణాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం.
అందువల్ల స్ట్రోక్ తర్వాత ప్రతి నిమిషం చాలా విలువైనది. ఈ నేపథ్యంలో 2025లో ‘ఎవ్రీ మినిట్ కౌంట్స్’అనే ప్రచార అంశంతో గుండెపోట్ల నివారణ, లక్షణాల గుర్తింపు, సకాలంలో చికిత్స ప్రాముఖ్యతను వివరించేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
ఎలా గుర్తించాలి?
ముఖం, చేయి లేదా కాలు యొక్క ఒకవైపుఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి, మాటల్లో అస్పష్టత, మసకబారిన దృష్టి, తలతిరగడం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి లాంటి ముందస్తుహెచ్చరికలను విస్మరించకూడదు. ఈ లక్షణాలున్న వారిని సీటీ/ఎమ్మారై స్కాన్ సౌకర్యాలున్నఆసుపత్రికి తీసుకెళ్లాలి
ప్రమాదాన్ని ఇలా తగ్గించుకోవచ్చు..
» గుండె జబ్బులను పూర్తిగా నివారించలేరు కానీ జీవనశైలిలో మార్పులు, అవగాహనతో ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
» ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్,అధిక చక్కెర పానీయాలు మానేయాలి.
» ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు, ప్రొటీన్లను చేర్చాలి.
» ధూమపానం మానేయాలి. మద్యపానం పరిమితం చేయాలి.
» క్రమం తప్పకుండా వ్యాయామం, జాగింగ్,యోగా చేయాలి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ఇతర అభిరుచులను అలవరుచుకుంటేఆందోళన తగ్గుతుంది.
» రోజూ మంచి నిద్ర (7–8 గంటలు) అవసరం.
» ఏడాదికోసారి రక్తపోటు, కొలెస్ట్రాల్ ,రక్తంలో చక్కెర స్థాయిలు, ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకుంటే సమస్యలను ముందుగానేగుర్తించే అవకాశం ఉంటుంది.


