
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ.. జీఎస్టీ 2.0 సోమవారం అమల్లోకి వచ్చింది. నూతన శ్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను శ్లాబ్‌లు సరళతరం కావడంతో.. ఇవాళ్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి.
వంటగది సరకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్‌లపై కొత్త ధరలు ముద్రించకున్నా.. విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఈ తగ్గింపులు మధ్య తరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఊరట లభించొచ్చు. అదే సమయంలో పండుగలపూట సాధారణంగానే డిస్కౌంట్‌లు ప్రకటించే కంపెనీల నిర్ణయంతో వినియోగదారులకు మరింత ఊరట దక్కే అవకాశం ఉంది.
జీఎస్టీ 2.0లో ప్రధానంగా తగ్గినవి ఇవే:
ఔషధాలు & వైద్య పరికరాలు
- 36 జీవన రక్షక ఔషధాలపై జీరో జీఎస్టీ
- సాధారణ మందులు 12% నుంచి 5%కి తగ్గింపు
- డయాగ్నస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లు – 5% GST
నిర్మాణ సామగ్రి
సిమెంట్ – 28% నుంచి 18%కి తగ్గింపు
ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాలు (18% GST)
- టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, డిష్‌వాషర్లు
- 32 ఇంచుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీ రేట్లే తగ్గనున్నాయి
- రూ.2,500-85,000 తగ్గనున్న టీవీల ధరలు
వాహనాలు
- చిన్న కార్లు (1200cc లోపు) – 28% నుంచి 18%
- ద్విచక్ర వాహనాలు – 18% GST
- మారుతి, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీల కార్లు లక్షల రూపాయల వరకు చౌకయ్యాయి
- ద్విచక్ర వాహనాల ధరలు రూ.18,800 వరకు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి.
సేవలు
- జిమ్, యోగా సెంటర్లు, సెలూన్లు, హెల్త్ క్లబ్‌లు – 5% GST
- రూ.7500 - అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై జీఎస్‌టీని 12% నుంచి 5 శాతానికి తగ్గింపు.. రూ.525 వరకు ఆదా. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) లేకుండా తగ్గించడం ఇందుకు కారణం.
దినసరి వినియోగ వస్తువులు (5% GST)
• టూత్‌పేస్ట్, సబ్బులు, షాంపూలు
• హేర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, టాల్కం పౌడర్
• బిస్కెట్లు, నంకీన్, జామ్, కెచప్, జ్యూస్
• ప్యాకేజ్డ్ ఫుడ్స్, డైరీ ప్రొడక్టులు (నెయ్యి, పనీరూ, బటర్)
• డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్
• సైకిల్స్, స్టేషనరీ, నోట్‌బుక్స్
• చపాతీ, రొటీ, పరాటా, పిజ్జా బ్రెడ్
అయితే హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్‌టీ 28% నుంచి 40 శాతానికి పెరిగింది. అంటే సిగరెట్లు, గుట్కాలు తదిరాలు. - చక్కెర కలిగిన లేదా ఫ్లేవర్ కలిగిన నాన్-అల్కహాలిక్ బీవరేజెస్, విలాసవంతమైన హైఎండ్ కార్లు (350cc పైగా బైకులు, 1200cc పెట్రోల్ కార్లు, 500ccపైన డీజీల్ కార్లు, 4 మీటర్ల కంటే పొడవున్న కార్లు, ఎస్‌యూవీలు), హెలికాప్టర్లు, యాచ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ & బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ యాప్స్ (రియల్ మనీ గేమ్స్), కోల్, లిగ్నైట్, పీట్ (Coal products), డైమండ్స్.. ప్రెషస్ స్టోన్స్ ఇలా విలాసవంతమైన వస్తువులకు జీఎస్టీ పెరిగింది.
జీఎస్టీ అంటే Goods and Services Tax. ఇది ఒక ఏకీకృత పన్ను విధానం, అంటే దేశవ్యాప్తంగా అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్నుగా వసూలు చేసే విధానం. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. అయితే.. జీఎస్టీ 2.0లో గతంలో ఉన్న నాలుగు శ్లాబ్‌లను నుంచి రెండుకు తగ్గించింది కేంద్రం. అందులో ఉన్న 12, 28 శాతం శ్లాబ్‌లను తొలగించింది కేంద్రం. దీంతో ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం శ్లాబ్‌లే కొనసాగనున్నాయి. అదే సమయంలో నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. 12 శాతంలో ఉండే 99 శాతం వస్తువులపై 5 శాతం జీఎస్టీ, 28 శాతం ఉండే 99 శాతం వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. తాజా సవరణలతో.. ఒకే పన్ను-ఒకే విధానం లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా అమలు కావొచ్చని కేంద్రం ఆశిస్తోంది.