
ఆ ప్రదేశం గురించి లోతుగా తెలుసుకోండిఆచార వ్యవహారాలపై అవగాహన తప్పనిసరి తీర్థయాత్రలు, అడ్వెంచర్ టూరిజంలో కీలకంప్రయాణం తీపి జ్ఞాపకాలు అందించేలా జాగ్రత్తలున్యూయార్క్ సిటీ, ప్యారిస్, కశ్మీర్, ఆగ్రా.. ప్లేస్ ఏదైనా ట్రిప్‌కు వెళ్లే ముందు ఆ ప్రదేశంలోని వింతలు, విశేషాల గురించి తెలుసుకుంటాం. వీడియోలు చూస్తాం. అక్కడి భద్రత, సంస్కృతి, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో కూడా కచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలి.
ఇందుకోసం వెబ్‌సైట్లలో వీడియోలు చూడటం.. కావాల్సిన వారితో ఫోన్లో మాట్లాడటం ద్వారా ‘టూర్‌కి ముందే ఓ టూర్’ వేయాల్సిందే. తద్వారా టూర్‌ని పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా జీవితాంతం గుర్తుండిపోయే ఒక టూర్.. మీ జ్ఞాపకాల బీరువాలో చేరుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
సెలవులు వస్తున్నాయంటే చాలు.. టూర్లు ప్లాన్ చేస్తుంటాం. మనం ఏ ప్రదేశానికి టూర్‌కి వెళ్లాలి అనుకుంటున్నామో అక్కడి ప్రసిద్ధ ఆకర్షణలు, చారిత్రక ప్రదేశాలు, సహజ అద్భుతాల గురించి నెట్‌లోనూ, అక్కడికి అప్పటికే వెళ్లి వచ్చిన వారి దగ్గరా ఆరాలు తీస్తాం. అయితే మనం వెళ్లాల్సిన చోట భద్రతా పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటిని మాత్రం తెలుసుకోం. సముద్రం, నదులు, జలపాతాలు, లోయలు, కొండ ప్రాంతాలకు వెళ్లడానికి యువత ఆసక్తి చూపుతారు. కానీ, అక్కడ పొంచి ఉండే ప్రమాదాల గురించి మాత్రం ఆరా తీయరు.
ఆచారాలు తెలిస్తే..
పర్యాటక ప్రాంత స్థానిక సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, కళలు, ఆహారపుటలవాట్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తద్వారా వాటికి విభిన్నంగా లేదా వ్యతిరేకంగా మనం నడుచుకోకుండా.. అక్కడి ప్రజలను గౌరవించి, వారి మన్ననలు పొందవచ్చు. సామాజిక మర్యాదలు, దుస్తుల నియమావళి, మతపరమైన లేదా సాంస్కృతిక ప్రదేశాలలో ఎలా ప్రవర్తించాలో ముందే అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు కొన్ని ఆలయాల్లోకి ప్రవేశించే ముందు.. కొన్ని రకాల దుస్తులు ధరించాలి. అలాగే, అక్కడ గుడిలో సమర్పించే ప్రసాదాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
తీర్థయాత్రలు
తీర్థయాత్రలకు ‘టూర్‌కి ముందే టూర్’ అత్యంత కీలకం. ఉదాహరణకు శ్రీశైలం వెళ్లేవారు ముందుగా, తప్పనిసరిగా సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ, ఇతర రాష్ట్రాల్లోనూ, నేపాల్ వంటి దేశాల్లోనూ ఇలాంటి నిబంధనలు చాలా ఉంటాయి. వాటిని ముందుగా తెలుసుకుంటే.. ‘అయ్యో, ముందు తెలుసుకోలేకపోయామే’ అని బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే చార్‌ధామ్ యాత్ర వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం సంసిద్ధం ఎలా కావాలో ముందే చూసి, తెలుసుకోవాలి.
వైల్డ్ లైఫ్, ఎకో టూరిజం
ప్రకృతి సంపదకు నిలయమైన ప్రాంతాలకు; అడవులు, జాతీయ పార్కులకు వెళ్లేటప్పుడు అక్కడి వాతావరణాన్ని మనం పాడుచేయకుండా ఉండటం చాలా ప్రధానం. మనవల్ల పర్యావరణ కాలుష్యం, అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతినకుండా నడుచుకోవాలంటే.. ‘టూర్‌కి ముందే టూర్’ చాలా అవసరం.
అడ్వెంచర్ టూరిజం
ట్రెక్కింగ్, స్కీయింగ్, వైట్‌వాటర్ రాఫ్టింగ్ వంటివి చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే తెలుసుకోవాలి. అవి ఎలా చేస్తారో, అందులో వాడే వస్తువుల గురించీ కూడా ముందే చూసి తెలుసుకోవాలి. పర్యటనకు ముందు నుంచే మానసికంగా, శారీరంగా దృఢంగా ఉండటం అవసరం. దుస్తుల నుంచి అవసరమైన మందుల వరకు ప్రతి విషయంలోనూ పూర్తి సంసిద్ధంగా ఉండాలి.
అదనపు జాగ్రత్తలు
వ్యాపారులు, స్థానికుల నుంచి తలెత్తే మోసాలు, గమ్యస్థానానికి సంబంధించిన ఏవైనా నిర్దిష్ట భద్రతా సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఉదాహరణకు అధిక నేరాల రేటు ఉన్న ప్రదేశానికి ప్రయాణిస్తుంటే.. రాత్రిపూట సంబంధిత ప్రాంతాలకు వెళ్లకపోవడం, విలువైన వస్తువుల గురించి మరింత అప్రమత్తంగా ఉండటం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇందుకోసం ట్రావెల్ బ్లాగ్స్, టూరిజం, ప్రభుత్వ వెబ్‌సైట్లను పరిశీలించాలి. స్నేహితులు, బంధువుల నుంచీ సమాచారాన్ని సేకరించాలి.
వీటిలో ముఖ్యం
» తీర్థయాత్రలు
» అడ్వెంచర్ టూరిజం
» ఎకో టూరిజం
» క్రూయిజ్ టూరిజం
» వైల్డ్‌లైఫ్ టూరిజం
» రూరల్ టూరిజం