చక్కా జామ్‌ ప్రశాంతం

Farmers across India hold peaceful chakka jam - Sakshi

పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ల్లో స్తంభించిన రహదారులు

మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడా రాస్తారోకోలు

ఢిల్లీ 50 వేల మందితో భారీ భద్రత

10 మెట్రో స్టేషన్లు పాక్షిక మూసివేత

అక్టోబర్‌ 2 వరకు నిరసనలు

ఎంఎస్‌పీకి చట్టబద్ధత వచ్చే వరకు ఉద్యమం ఆగదు

రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ/చండీగఢ్‌/ఘజియాబాద్‌: కొత్త వ్యవసా య చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతు సంఘాలు చేపట్టిన చక్కాజామ్‌ శనివారం ప్రశాంతంగా ముగిసింది. రైతుల నిరసనలకు మొదట్నుంచీ ముందు నిలుస్తున్న పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధనం పూర్తిస్థాయిలో జరిగింది. చాలా రాష్ట్రాల్లో అక్కడక్కడా రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీని చక్కాజామ్‌ నుంచి రైతు సంఘాలు మినహాయింపు ఇచ్చినప్పటికీ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద ఇంటర్నెట్‌ సేవలను హోంశాఖ బంద్‌ చేసింది. ఢిల్లీలో మెట్రో రైలు స్టేషన్లను పాక్షికంగా మూసివేశారు. అక్టోబర్‌ 2వ తేదీ వరకు నిరసనలు కొనసాగిస్తామని, సాగు చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.  చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చక్కా జామ్‌ చేపట్టాలని పిలుపునిచ్చింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బాంధించాలని కోరింది.

దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద శనివారం యథావిథిగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. చక్కాజామ్‌కు మద్దతు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీలోని షహీదీ పార్కు వద్ద 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని కుండ్లి– మనేసర్‌–పల్వాల్‌(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌ హైవేపైకి వేలాదిగా రైతులు చేరుకున్నారు. రహదారిపై వాహనాలను అడ్డుగా ఉంచారు.  పంజాబ్, రాజస్తాన్, హరియాణాల్లో రైతులు తమ ట్రాక్టర్‌–ట్రైలర్లను జాతీయరహదారులపై అడ్డుగా ఉంచారు. జాతీయ జెండాలను తమ ట్రాక్టర్లపై ఎగురవేశారు.

చక్కాజామ్‌కు మద్దతుగా ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ సంఘాలు, పార్టీలు రాస్తారోకోలు చేపట్టాయి. రహదారులపై బైఠాయించిన రైతులను పెద్ద సంఖ్యలో పోలీసులు కొద్దిసేపు నిర్బంధించారు. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో రైతు సంఘాలు రోడ్లపై బైఠాయించాయి. మహారాష్ట్రలోని కరాడ్, కొల్హాపూర్‌ నగరాల్లో రాస్తారోకోలు జరిగాయి. కరాడ్‌లో రోడ్డుపైకి చేరుకున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ సతీమణి సత్యశీల ఉన్నారు. కొల్హాపూర్‌లో స్వాభిమాన్‌ షేత్కారీ సంఘటన్‌ నేత రాజు శెట్టిని కొద్దిసేపు పోలీసులు నిర్బంధించారు. కర్ణాటకలో కొన్ని కన్నడ సంఘాలు, వివిధ రైతు సంఘాలు చాలా ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. తమిళనాడులో చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.

ఇంటర్నెట్‌ సేవలు బంద్‌
చక్కా జామ్‌ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నిరసన కేంద్రాలైన సింఘు, సిక్రీ, ఘాజీపూర్‌ల వద్ద ఇంటర్నెట్‌ సేవలను కేంద్ర హోం శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ మూడింటితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నెట్‌ సేవలు శనివారం అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఇక్కడ జనవరి 29వ తేదీ నుంచే ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం బంద్‌ చేయించిన విషయం తెలిసిందే. జనవరి 26వ తేదీన ట్రాక్టర్‌ ర్యాలీ సమయంలో అల్లర్లు జరగడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఢిల్లీలో భారీ భద్రత
చక్కాజామ్‌ నిరసన నుంచి మినహాయించినప్పటికీ గణతంత్ర దినోత్సవం నాటి అనుభవాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ, రిజర్వు బలగాలను కలిపి దాదాపు 50 వేల మందిని మోహరించారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలపై నిఘా కోసం డ్రోన్‌ కెమెరాలను వినియోగించారు. మండీ హౌస్, ఎస్‌టీవో, ఢిల్లీ గేట్‌ సహా ఢిల్లీలోని 10 మెట్రో రైల్వే స్టేషన్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పాక్షికంగా మూసివేశారు. ఎర్రకోట, ఐటీవో వంటి ముఖ్య కూడళ్ల వద్ద భద్రతాబ లగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసు యంత్రాంగం, అధికారులకు వ్యతిరేకంగా వ్యాపించే పుకార్లను అడ్డుకునేం దుకు సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. సరిహద్దులతోపాటు అదనంగా ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేశారు.

గాంధీ జయంతి వరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు గాంధీ జయంతి(అక్టోబర్‌ 2) వరకు కొనసాగుతాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ చెప్పారు. చట్టాల రద్దు విషయంలో రాజీ పడేది లేదన్నారు. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర లభించేలా చట్టం అమల్లోకి వచ్చాకే రైతులు ఇళ్లకు వెళతారని పేర్కొన్నారు. ‘ఈ విషయంలో భ్రమలు వద్దు. వేదికలు మారవు, నిరసనలు ఆగవు. వాళ్లు(ప్రభుత్వం) ఇనుప మేకులు నాటుతారు. మనం పంటలను విత్తుదాం’ అని తెలిపారు. ‘రైతులం మేమే, సైనికులమూ మేమే’ తమ ఉద్యమ నినాదమన్నారు. ‘రైతులు తమ పొలాల నుంచి పిడికెడు మట్టిని తీసుకువచ్చి, నిరసన కేంద్రాల వద్ద ఉన్న పోరాట మట్టిని వెంట తీసుకెళ్లాలి. ఈ మట్టితో మీ భూమిలో పోరాటాన్ని వ్యాపింపజేయండి.

వ్యాపారులెవరూ మీ భూములను కబ్జా చేయాలని చూడరు’ అని పేర్కొన్నారు. ‘ఈ చట్టాలను ఇప్పుడు కాకుంటే. మరెప్పుడూ రద్దు చేయరు. దేశంలోని రైతులు తమ ఉత్పత్తులకు సగం ధరే పొందుతున్నారు. ఎంఎస్‌పీని పంజాబ్, హరియాణాల్లో మాత్రమే ఇస్తున్నారు. ఒక్క రాష్ట్రానికే ఈ పోరాటం పరిమితం అయిందంటూ వాళ్లు(ప్రభుత్వం) మనల్ని విభజించటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, మనది దేశవ్యాప్త పోరాటం’ అని తెలిపారు. ఉపాధి చూపే భూములను రైతులు కాంట్రాక్టు ఫార్మింగ్‌కు ఇవ్వవద్దని కోరారు. దేశంలోని రైతులంతా తమకు మద్దతుగా నిలిచారన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న రైతులకు నోటీసులిచ్చిన పోలీస్‌స్టేషన్ల ఎదుట కూడా రైతులు ఆందోళనలు చేపడతారని తికాయత్‌ అన్నారు. ‘ఒకప్పుడు అయోధ్యలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వేలాదిగామందికి నోటీసులు ఇవ్వలేదు. అక్కడి గుంపును ఎందుకు ఆపలేకపోయారు? అని ప్రశ్నించారు. రైతుల నుంచి భూములను ఎవరూ లాక్కోలేరని చెప్పారు. అందుకుగాను, రైతులు, సైనికులు ముందుకు రావాలన్నారు. ఘాజీపూర్‌ వద్ద బారికేడ్ల అవతల ఉన్న భద్రతా సిబ్బందికి చేతులో జోడిస్తూ ఆయన..‘మీ అందరికీనా వందనాలు. రైతుల పంట పొలాలను కాపాడాల్సింది మీరే’ అని తికాయత్‌ కోరారు.

ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద జవాన్లకు నమస్కరిస్తున్న రైతు నేత రాకేశ్‌ తికాయత్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top