మాట మీద నిలబడని ప్రభుత్వం

 Fail To Fulfill Guarantees - Sakshi

మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు 

వ్యాపారాలు బంద్‌ ఉండగా బిల్లులెలా కడతారని ఆగ్రహం 

విద్యుత్‌ బిల్లులో వెంటనే రాయితీ ప్రకటించాలని డిమాండ్‌ 

ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు

సాక్షి, ముంబై: మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ఇది మాట మీద నిలబడని ప్రభుత్వమని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సాతారా, నాగ్‌పూర్, ముంబై తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు. సాతారా జిల్లా కరాడ్‌లో నిర్వహించిన ఆందోళనలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్‌ మాట్లాడుతూ.. 100 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామి ఇచ్చిందని, అది కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలందరికీ భారీ ఎత్తున విద్యుత్‌ బిల్లులు పంపించారని గుర్తుచేశారు.

అయితే బిల్లుల్లో రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ, ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాయితీ ఇవ్వలేమని విద్యుత్‌ బిల్లులు మొత్తం చెల్లించాల్సిందేనని విద్యుత్‌శాఖ మంత్రి స్పష్టం చేశారు. కానీ, ఇచ్చిన హామీల గురించి మాత్రం ఏం మాట్లాడటం లేదన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఆర్థికంగా కుంగిపోయిన పేద ప్రజలు పెంచి ఇచ్చిన విద్యుత్‌ బిల్లులను ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. బిల్లులను సవరించి ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. రాయితీలు ఇవ్వనంత వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని చంద్రకాంత్‌ పాటిల్‌ హెచ్చరించారు.  

బంద్‌ ఉండగా బిల్లులా? 
నాగ్‌పూర్‌లో బీజేపీ చేపట్టిన ఆందోళనలో మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి చంద్రశేఖర్‌ బావన్‌కులేతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంపై నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో దుకాణాలు, కార్యాలయాలు, మూసి ఉన్నాయని, అయినప్పటికీ లక్షల్లో బిల్లులు పంపారని మండిపడ్డారు.

వ్యాపారాలు బంద్‌ ఉండగా లాండ్రీ, క్షౌరశాలలు ఇతరులు విద్యుత్‌ బిల్లులు ఎలా కడతారంటూ నిలదీశారు. అందుకే పేద ప్రజల విద్యుత్‌ బిల్లులు కట్‌ చేసేందుకు ఎవరైనా వస్తే బీజేపీ అడ్డుకుంటుందని చంద్రశేఖర్‌ హెచ్చరించారు. ముంబైలో నిర్వహించిన ఆందోళనలో బీజేపీ ముంబై ఇన్‌చార్జీ అయిన కాందివలి మాజీ ఎమ్మెల్యే అతుల్‌ భాత్కలకర్‌ పాల్గొన్నారు. ఆయన కూడా ఆఘాడీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించినట్టు బీజేపీ నేతలు పేర్కొన్నారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top