బారామతి: ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడంతో విమానంలో ఉన్న అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు సజీవ దహనమయ్యారు. విమానం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇది ఘోర ప్రమాదమని చెబుతున్నారు. విమానం కూలిన వెంటనే నాలుగైదు పేలుళ్లు సంభవించాయని వెల్లడించారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడలేకపోయినట్టు చెప్పారు. తమ కళ్లెదుటే అజిత్ పవార్ మంటల్లో కాలిపోవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కళ్లెదుటే అజిత్ పవార్ సహా ఐదుగురు మంటల్లో కాలిపోవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
''విమాన ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాను. చాలా బాధాకరమైన ఘటన. విమానం కిందకు దిగేటప్పుడు అది కూలిపోతున్నట్టుగా అనిపించింది. క్షణాల్లో నా కళ్లెదుటే అది కుప్ప కూలింది. వెంటనే మేమంతా అక్కడికి పరుగెత్తికెళ్లాం. విమానంలో మళ్లీ 4-5 పేలుళ్లు సంభవించాయి. దీంతో చాలా మంది అక్కడికి చేరుకున్నారు. విమానంలో ఉన్న వారికి కాపాడాలని అనుకున్నాం. కానీ భారీగా మంటలు వ్యాపించడంతో సహాయం చేయలేకపోయాం. అజిత్ పవార్ విమానంలోనే ఉన్నారని తెలిసి చాలా బాధపడ్డాం. ఈ వేదనను మాటల్లో వర్ణించలేన''ని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాతో చెప్పారు.
విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, మహారాష్ట్ర రాజకీయ నేతలు బారామతికి తరలివెళ్లారు. కాగా, అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు రికార్డైన సీసీ కెమెరా ఫుటేజి వైరల్‌గా మారింది.


