బెంగాల్‌లో హోరాహోరి! | Exit poll results also sparked a stir with one or two sensational predictions | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో హోరాహోరి!

Apr 30 2026 3:57 AM | Updated on Apr 30 2026 3:57 AM

Exit poll results also sparked a stir with one or two sensational predictions

దీదీదే గెలుపని కొన్ని.. కమలానిదే విజయమని మరికొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు

తమిళనాడులో మరోసారి స్టాలిన్‌ సర్కార్‌ ఖాయం! 

మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా

విజయ్‌ టీవీకే పార్టీదే ఆధిక్యమన్న యాక్సిస్‌ మై ఇండియా  

కేరళలో గద్దె దిగబోతున్న పినరయి విజయన్‌  

కమ్యూనిస్టుల అడ్డాలో ఈసారి కాంగ్రెస్‌ కూటమికే పట్టం  

అస్సాంలో మరోసారి కాషాయ ప్రభుత్వం  

పుదుచ్చేరి మళ్లీ ఎన్డీయే ఖాతాలోకే..  

న్యూఢిల్లీ: పార్టీల పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు కూడా ఒకట్రెండు సంచలన అంచనాలతో హోరెత్తాయి.పశ్చిమ బెంగాల్‌లో తుది విడత పోలింగ్‌ బుధవారం సాయంత్రం ముగిసిన వెంటనే ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ప్రకటించాయి. కీలక రాష్ట్రమైన బెంగాల్‌లో ఈసారి మమతా బెనర్జీ పార్టీకి పరాజయం తప్పదని కొన్ని సంస్థలు వెల్లడించగా, ఆమె వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడం తథ్యమని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి. మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో అధికార డీఎంకే కూటమి స్పష్టమైన మెజార్టీతో మళ్లీ జయకేతనం ఎగురవేయనున్నట్లు అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తెలిపాయి. దళపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. 

ఇక్కడ అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని వెల్లడించాయి. అయితే విజయ్‌ మరో ఎంజీఆర్‌గా అవతరించబోతున్నారని యాక్సిస్‌ మై ఇండియా సంస్థ ప్రకటించడం గమనార్హం. టీవీకే పార్టీ 35 శాతం ఓట్లతో 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా నిలవబోతోందని ఆ సంస్థ తేల్చిచెప్పింది. అస్సాంలో ఎన్డీయే మరోసారి నెగ్గడం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టంచేశాయి. కమ్యూనిస్టుల అడ్డా అయిన కేరళలో ఈసారి వారికి పరాభవం తప్పదని, పినరయి విజయన్‌ గద్దె దిగబోతున్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌ ఓడిపోతుందని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ అధికారంలోకి వచ్చే సూచనలున్నాయని వెల్లడించాయి. కేరళ ప్రజలు మార్పునకు అనుకూలంగా ఓటు వేశారని తెలిపాయి. పుదుచ్చేరిలో ఎన్డీయేకు మళ్లీ స్పష్టమైన విజయావకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి.  


టీఎంసీపై బీజేపీకి స్వల్ప ఆధిక్యం  
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్‌ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్‌ వెల్లడించింది. పి–మార్క్‌ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్‌ డైరీ’ఎగ్జిట్‌ పోల్‌ తేల్చింది. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వాస్తవమైన ఫలితాలను అంచనా వేయడంలో అవి విఫలమయ్యాయి.  


Advertisement
 
Advertisement
Advertisement