మ‌మ‌తను ప‌ద‌వి నుంచి గెంటేయండి | Evict her, Mahesh Jethmalani On Mamata Banerjee Wont Resign Move | Sakshi
Sakshi News home page

మ‌మ‌త బెన‌ర్జీ వైఖ‌రిపై జెఠ్మలానీ ఫైర్‌

May 6 2026 6:07 PM | Updated on May 6 2026 6:27 PM

Evict her, Mahesh Jethmalani On Mamata Banerjee Wont Resign Move

ఢిల్లీ: ప‌శ్చిమ‌ బెంగాల్ ముఖ్యమంత్రి ప‌ద‌వి నుంచి మమతా బెనర్జీని గెంటేయాల‌ని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఎన్‌డిటీవీకి చెందిన పద్మజా జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాతీర్పును అప‌హాస్యం చేసేలా మ‌మ‌తా బెన‌ర్జీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌మ‌త వైఖ‌రి క్షమించరానిదని, ఆమె వ్య‌వ‌హార‌శైలి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలుగా మారింద‌న్నారు. రాజీనామా చేయ‌క‌పోతే గ‌వ‌ర్న‌ర్ త‌న అధికారాలను ఉప‌యోగించి ప‌ద‌వి నుంచి మ‌మ‌త‌ను తొల‌గించాల‌ని అన్నారు.

''మ‌మ‌తా బెన‌ర్జీ వ్య‌వ‌హార‌శైలి అవమానకరంగా ఉంది. ఆమెకు క‌చ్చితంగా గుణపాఠం నేర్పాలి. ఆమె ఇలా చేసినందుకు నాకు సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే త‌న‌కు తాను రాజీనామా చేసివుంటే హుందాగా ప‌దవి నుంచి త‌ప్పుకునేవారు. రాజీనామా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల గ‌వ‌ర్న‌రే ఆమెను తొల‌గించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆమె ఇప్పుడు గవర్నర్ దయ మీద ఆధారపడి పదవిలో ఉన్నారు కాబట్టి, వెంట‌నే గవర్నర్ ఆమెను అధికారికంగా తొలగించాలి. అప్ప‌టికీ సీఎం కుర్చీ వ‌ద‌ల‌ను అంటే నిర్దాక్షిణ్యంగా ఆమెను గెంటేయాల‌''ని మహేష్ జెఠ్మలానీ అన్నారు.

ఒకవేళ మ‌మ‌తా బెనర్జీ సీఎం కార్యాలయంలోనే తిష్ట వేస్తే, గవర్నర్ పోలీసులను పంపి ఆమెను ఖాళీ చేయించవచ్చని చెప్పారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన‌ తీర్పును మ‌మ‌త గౌర‌వించాల‌ని, ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందేన‌ని అన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలను ఎన్నిక‌ల సంఘం ధ్రువీక‌రించిన క్షణం నుంచే ఓట‌ర్ల తీర్పు అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని, ఇప్పుడు సీఎం కార్యాల‌యంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిగానే మ‌మ‌త‌ను ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ఎన్నిక‌ల సంఘ‌మే అస‌లైన విల‌న్‌: మ‌మ‌త‌
ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోన‌ని మ‌మ‌తా బెన‌ర్జీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆమె కోల్‌క‌తాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జాతీర్పుతో ఓడలేద‌ని, కుట్ర కార‌ణంగా ఓడిపోయామ‌ని చెప్పారు. తాము బీజేపీతో పోరాటం చేయ‌లేద‌ని, ఎన్నిక‌ల సంఘంతో పోరాడామ‌ని అన్నారు. ''నేను ఓడిపోలేదు. లోక్‌స‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌కు రాజీనామా లేఖ స‌మ‌ర్పించే ప్ర‌సక్తే లేదు. మా ఓట్ల‌ను చోరీ చేశారు. చ‌రిత్ర‌లో ఇదో చీక‌టి అధ్యాయం. ఇందులో ఎన్నిక‌ల సంఘ‌మే అస‌లైన విల‌న్'' అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ మండిప‌డ్డారు. 

చ‌ద‌వండి: త‌మిళ‌నాడులో విజ‌య్ గెలుపు.. ట్రెండింగ్‌లో అన్నామ‌లై!

మ‌మ‌త‌ను తొల‌గించాల్సిందే: హిమంత బిస్వ‌శ‌ర్మ
మ‌మ‌తా బెన‌ర్జీ వ్యవ‌హార‌శైలిపై బీజేపీ నేత‌, అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వ‌శ‌ర్మ స్పందించారు. ఆమెను ప‌ద‌వి నుంచి తొల‌గించాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీతో ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి మ‌మ‌తా బెన‌ర్జీ రాజీనామా చేయకపోతే, ఆమెను బ‌ల‌వంతంగా తొలగించాల్సి ఉంటుంది. దేశం ఆమె ఇష్టానుసారం నడవదు. గవర్నర్ కొంత కాలం వేచి చూస్తారు, ఆ తర్వాత ఆమెను తొలగిస్తారని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement