EPFO: గుడ్‌ న్యూస్‌, గంటలోనే మెడికల్‌ అడ్వాన్స్‌!

 EPFO: Get Rs 1 lakh in just one hour during medical emergency - Sakshi

కరోనా, ఇతర అత్యవసర వైద్య అవసరాల నిమిత్తం లక్ష రూపాయలు

దరఖాస్తు చేసుకున్న గంటలోనే  మెడికల్ అడ్వాన్స్  చెల్లింపు

సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తన ఖాతాదారులకు ఊరటనిస్తోంది. కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్‌ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్‌ సదుపాయాన్ని అందిస్తోంది.  ఇందుకు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదు, ఈ మేరకు ఈపీఎఫ్‌వో జూన్‌ 1న ఒక  సర్క్యులర్  జారీ చేసింది.

కరోనావైరస్‌ సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఒక లక్ష మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఇపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న గంటలోనే  ఆ మొత్తం ఖాతాకు జమ చేస్తామని వెల్లడించింది. 

అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ సభ్యులు ఈ అడ్వాన్స్ ఎలా తీసుకోవచ్చో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 

రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సీజీజహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి.  ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే, అపుడు  ఒక అధికారి  వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు.

ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి , రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.  
అతడు,  లేదా కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసిన ఒక గంటలోపే లక్ష రూపాయల మొత్తాన్ని  జమచేస్తారు.

ఈపీఎఫ్‌వో  బోర్డు  మే నెలలో  జారీ చేసిన కోవిడ్ -19 అడ్వాన్స్‌కు ఇది పూర్తిగా భిన్నం.. ఇందులో  మొత్తం ఫండ్‌లో  నాన్‌ రిఫండబుల్‌ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top