కేరళం మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆకస్మిక తనీఖీలకు దిగింది. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నట్లు ఏఎన్‌ఐ సంస్థ ఓ కథనం ఇచ్చింది. ఈ సోదాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం కూడా ఉందని ఆ కథనం పేర్కొంది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో.. పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. విజయన్ కుమార్తె వీణ అవినీతి కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఏంటీ సీఎంఆర్‌ఎల్ కేసు?
కేరళ రాజకీయాల్లో ఇటీవల తరచూ చర్చకు వచ్చిన అంశాల్లో సీఎంఆర్‌ఎల్ కేసు ఒకటి. కొచిన్ మినలర్స్ అండ్ రూటిలె లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత, సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే..
ఈ చెల్లింపులు ప్రధానంగా కన్సల్టెన్సీ/సర్వీస్ ఫీజుల పేరుతో జరిగినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ సేవలు నిజంగా అందించబడ్డాయా? లేదా? అనేది ప్రధాన వివాదాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ, మీడియా వర్గాలు ఈ లావాదేవీలపై ప్రశ్నలు లేవనెత్తాయి.
విజయన్ కూతురి పేరుతో..
ఈ వివాదంలో ముఖ్యంగా వీణా విజయన్‌కు సంబంధించిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ (Exalogic Solutions) అనే సంస్థ పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అప్పటి ప్రతిపక్ష పార్టీలు విజయన్ సర్కార్‌పై విరుచుకుపడ్డాయి. అయితే ఈ ఆరోపణలను వీణా విజయన్ ఇప్పటికే ఖండించారు. తమపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరితమని, అన్ని లావాదేవీలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని ఆమె చెప్పారు. అయినప్పటికీ..
ఈ మొత్తం వ్యవహారం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నాడు అధికార పక్షంగా ఉన్న విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఈ ఆరోపణలను రాజకీయ దాడిగా అభివర్ణించింది. ప్రతిపక్షాలు మాత్రం అవినీతి అనుమానాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్ని తమ ఆయుధంగా యూడీఎఫ్ మల్చుకుంది. అలా విజయన్ ఓటమిలో ఈ ఆరోపణలు కూడా ఓ భాగం కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ కేసులో కోర్టు స్థాయిలో(హైకోర్టులో విచారణ దశలో ఉంది) నేరం నిర్ధారణ కాలేదు. అయితే ఈడీ సోదాల నేపథ్యంలో ఈ కేసు మరోసారి ప్రాముఖ్యతను సంతరించుకుంది.


