డీఎంకే ఎన్నికల ఖర్చు రూ. 114 కోట్లు 

DMK had Spent Rs 114 Crore For Assembly Polls - Sakshi

అన్నాడీఎంకే రూ. 57 కోట్లు 

సీఈసీకి లెక్కల సమర్పణ

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే రూ. 114 కోట్లు, అన్నాడీఎంకే రూ. 57 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందుకు తగ్గ లెక్కలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరాయి. రాజకీయ పార్టీలు విరాళాల్ని చెక్కులు, నగదు, డాక్యుమెంట్ల రూపంలో పొందేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇందుకు తగ్గ లెక్కల్ని ఎన్నికల అనంతరం సీఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ ఏడాది  ఏప్రిల్, మే నెలలో పుదుచ్చేరితో పాటుగా  రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ – బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టాయి. ఆయా పార్టీలు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులకు తగ్గ వివరాల్ని సీఈసీకి సమర్పించి ఉన్నాయి. ఆ వివరాలు  ఆదివారం వెలుగులోకి వచ్చాయి.  

డీఎంకే ఖర్చు ఇలా.. 
తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరి ఎన్నికల్లో డీఎంకే రూ. 114 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్నికల నగారా అనంతరం ఆ పార్టీకి రూ. 134 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. తమిళనాడులో పోటీ చేసిన డీఎంకే అభ్యర్థులు 188 మందిలో ఒకొక్కరికి  రూ.  25 లక్షలు ఎన్నికల ఖర్చుగా అందజేశారు. పుదుచ్చేరిలో పోటీ చేసిన 13 మందికి రూ. 15 లక్షలు చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో తదితర వాటికి రూ. 5. 72 కోట్లు,  ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్‌ సంస్థకు  రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. టీవీ, సామాజిక మాధ్యమాలు తదితర ప్రచారాలకు రూ. 39 కోట్లు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు తదితర వాటికి రూ. 12 కోట్లు ఖర్చు చూపించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రచారం కోసం విమాన ప్రయాణ ఖర్చుగా రూ. 2 కోట్ల 25 లక్షలుగా వెల్లడించారు. 

అన్నాడీఎంకే లెక్కలు.. 
అసెంబ్లీ ఎన్నికల నగారా మోగే సమయానికి అన్నాడీఎంకే ఖాతాలో రూ. 266 కోట్ల 14 లక్షలు ఉన్నట్టు, నగారా తదుపరి రూ. 14 కోట్ల 46 లక్షలు విరాళం రూపంలో వచ్చినట్టు లెక్కలు చూపించారు. ప్రకటనలు, తదితర వాటికి రూ. 56 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు. పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్‌ పళనిస్వామి హెలికాఫ్టర్‌ ప్రచారానికి రూ. 13 లక్షలు ఖర్చు పెట్టినట్టు ప్రకటించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top