సీఎల్పీ నేతగా డీకేఎస్‌ ఏకగ్రీవం | DK Shivakumar unanimously elected CLP leader, take over as Karnataka CM | Sakshi
Sakshi News home page

సీఎల్పీ నేతగా డీకేఎస్‌ ఏకగ్రీవం

May 31 2026 4:31 AM | Updated on May 31 2026 4:31 AM

DK Shivakumar unanimously elected CLP leader, take over as Karnataka CM

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రాష్ట్ర గవర్నర్‌ 

3న కర్ణాటక నూతన సీఎంగా శివకుమార్‌ ప్రమాణ స్వీకారం 

సాక్షి బెంగళూరు:  కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎఎల్పీ) నేతగా ఆయన ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ సజావుగా సాగింది. బెంగళూరు విధానసౌధలో శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరిగింది. 

ఈ భేటీలో స్పీకర్‌ యూటీ ఖాదర్‌ సహా నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో హాజరు కాలేకపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. అనుకున్న సమయానికే డీకే శివకుమార్‌ విధానసౌధకు చేరుకున్నారు. విధానసౌధ గడపకు నమస్కరించి లోపలికి వెళ్లారు. సీఎల్పీ నాయకుడిగా డీకే శివకుమార్‌ పేరును ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ‘‘మన శాసనసభాపక్ష నాయకుడు డీకే శివకుమార్‌’’అంటూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, హోంమంత్రి పరమేశ్వర ఆమోదించారు. 

తర్వాత ఎమ్మెల్యేలందరూ చేతులెత్తి ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. అనంతరం సీఎల్పీ నేతగా శివకుమార్‌ ఎన్నికైనట్లు కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులుగా కేసీ వేణుగోపాల్, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా పాల్గొన్నారు. అయితే, ఈ భేటీ మధ్యలో 10 నిమిషాలపాటు విరామం తీసుకోవడం విశేషం. సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా ప్రత్యేకంగా మరో గదిలో కొద్దిసేపు సమావేశమైనట్లు తెలిసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఇన్నాళ్లూ అందించిన సేవలను కొనియాడుతూ సీఎల్పీ భేటీలో డీకే శివకుమార్‌ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.  

గవర్నర్‌తో భేటీ  
సీఎల్పీ సమావేశం కంటే ముందు డీకే శివకుమార్‌ లోక్‌భవన్‌కు వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసింది. లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్‌ కలిసి చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై గవర్నర్‌కు సమాచారం అందించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారాన్ని జూన్‌ 3న సాయంత్రం 4.05 గంటలకు ఖరారు చేసుకున్నారు. 

అదేరోజు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, సీఎల్పీ నేత ఎన్నిక పూర్తయిన తర్వాత డీకే శివకుమార్, సిద్ధరామయ్య, సీనియర్‌ నేతలు కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు తెలియజేశారు. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని తెలిపారు. ఈ మేరకు లేఖ అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డీకే శివకుమార్‌ను గవర్నర్‌ ఆహా్వనించారు.  

జూన్‌ 3న నిరాడంబరంగా ప్రమాణం 
సీఎల్పీ భేటీలో డీకే శివకుమార్‌ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కరచాలనం చేస్తూ పలకరించారు. జూన్‌ 3న సాయంత్రం 4.05 గంటలకు లోక్‌భవన్‌లో ఆయన కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పెట్రోల్, డీజిల్‌ కొరత కొనసాగుతుండడంతోపాటు బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో పెట్టుకొని నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయాలని డీకే శివకుమార్‌ నిర్ణయించారు.  

అంకితభావంతో సేవలందిస్తాం: డీకేఎస్‌  
కర్ణాటక ప్రజలకు అంకితభావం, నిజాయితీతో సేవ చేయడానికి తాను, కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉన్నట్లు కాబోయే సీఎం డీకే శివకుమార్‌ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. తనను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.  

సమన్వయ సమితికి నో  
రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య సూచించగా, కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలు తిరస్కరించారు. పారీ్టలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, ప్రభుత్వంతో సమన్వయం కోసం కొత్తగా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని వారు నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement