
బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పడమే కాకుండా, నగరాన్ని గుంతల నగరంగా.. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అభివర్ణించారు. వసతుల కొరతపై కినుక వహించిన కంపెనీలు బెంగళూరును వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడానికి చూస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ స్పందించారు.
''బెంగళూరు సురక్షితంగా ఉందని భావిస్తేనే.. కంపెనీలు ఇక్కడ వ్యాపారం చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడ ఇన్ని కంపెనీలు ఎందుకు ఉన్నాయి?.. ఎందుకంటే ఇక్కడ 25 లక్షలకు పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఈ సంఖ్య కాలిఫోర్నియాలో కేవలం 1.3 లక్షలు మాత్రమే. బెంగళూరులో సుమారు 2 లక్షల మంది విదేశీయులు పనిచేస్తున్నారు. ఎందుకు?, ఎందుకంటే ఇక్కడ ప్రతిభ ఉంది" అని శివకుమార్ అన్నారు.
కుమారస్వామిని లక్ష్యంగా చేసుకుని.. ''రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత ఆయనదే. ప్రధానమంత్రి నుంచి కనీసం రూ. 10,000 కోట్లు నిధులను తీసుకురావచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుందనిగానీ.. రాష్ట్రంలోని సమస్యలను గురించి ఆయన ఎప్పుడూ కేంద్రానికి విన్నవించరు. వార్తల్లో ఉండటానికి మాత్రమే ట్వీట్ చేస్తున్నారు" శివకుమార్ అన్నారు.
గుంతల సమస్యపై ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షం వల్ల రోడ్ల పరిస్థితిని కొంత అస్తవ్యస్తంగానే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించాము. ఇందులో దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకున్నాము. శనివారం జరగబోయే మరో సమావేశానికి సంబంధిత అధికారులు ఒక ప్రణాలికను తీసుకువస్తారు.
నవంబర్ నాటికి గుంతలను పూడ్చడానికి కాంట్రాక్టర్లకు తుది గడువు ఇచ్చామని శివకుమార్ పేర్కొన్నారు. నగరంలో రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాల కోసం రూ.1,100 కోట్లు ప్రకటించడం జరిగింది. మా లక్ష్యం పరిశుభ్రమైన బెంగళూరు, ట్రాఫిక్ సమస్యను తగ్గించడం అని ఆయన వెల్లడించారు.