‘ఈడీ దర్యాప్తు పరిధి.. మనీ లాండరింగ్ వరకే’.. స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ‘‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేవలం నగదు అక్రమ ప్రవాహ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 3లో పేర్కొన్న నిర్వచనం పరిధిలోకి వచ్చే మనీ లాండరింగ్ నేరాలపై విచారణ, దర్యాప్తు చేసే అధికారాలు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప సదరు నేరానికి సంబంధించిన ఇతర అభియోగాలు, అక్రమాలపై విచారణ జరిపే పరిధి ఈడీకి లేదు’’ అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
అలాంటి వాటిపై విచారణ జరపడం ఇతర అధీకృత సంస్థల బాధ్యత అని స్పష్టం చేసింది. తన విచారణలో భాగంగా అలాంటి ఇతర నేరాలకు సంబంధించి సాక్ష్యాధారాలు లభిస్తే దర్యాప్తు నిమిత్తం వాటిని సంబంధిత సంస్థలకు అందజేయాలని న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన తీర్పులో పేర్కొన్నారు.