మత విశ్వాసాలకు తగ్గట్లుగా..ఆప్‌ మంత్రి జైన్‌కి మరో దెబ్బ

Delhi Court Reject Satyendar Jain plea for Religious Beliefs Food - Sakshi

సాక్షి, ఢిల్లీ:  తీహార్‌ జైల్‌లో ఉన్న ఆప్‌ మంత్రి సత్యేందర్‌ కుమార్ జైన్‌కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్‌ అభ్యర్థనలు తిరస్కణకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైంది. 

జైల్‌లో మత విశ్వాసాలకు తగ్గట్లుగా ఆహారం తీసుకునేట్లు తనను అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా తీహార్‌ జైలు అధికారులను ఆదేశించాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.  తీహార్‌ జైలులో మంత్రి జైన్‌కు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందడం లేదని, ఆయనకు  ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా జైలు అధికారులను ఆదేశించాలంటూ కూడా ఆ అభ్యర్థన పిటిషన్‌ పేర్కొంది. అయితే.. ప్రత్యేక న్యాయవాది వికాస్‌ ధూల్‌ ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. 

మే 31వ తేదీన జైన్‌ అరెస్ట్‌ అయ్యారు. అప్పటి నుంచి ఆయన జైన్‌ టెంపుల్‌కు వెళ్లలేదు. జైన మత విశ్వాసాలను నికచ్ఛిగా పాటించే సత్యేందర్‌ కుమార్‌ జైన్‌.. అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోలేకపోతున్నారు అని ఆయన తరపున పిటిషన్‌ దాఖలైంది. కానీ, జైలు అధికారులు మాత్రం ఆ డిమాండ్‌ను అంగీకరించలేదు. ఒక ఖైదీని ప్రత్యేకంగా చూడడం వీలు కాదని, ఖైదీలందరికీ కుల, మతాలకు అతీతంగా ఒ‍కేరకమైన ఆహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఏకీభవించిన స్పెషల్‌ జడ్జి వికాస్‌.. సత్యేందర్‌ జైన్‌ పిటిషన్‌ను కొట్టేశారు. 

ఇక.. 2017లో ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసింది. ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే చివరన ఆయన్ని అరెస్ట్‌ చేసి.. తీహార్‌ జైలుకు తరలించారు. నవంబర్‌ 17వ తేదీన ఆయనతో ఈ కేసులో అరెస్ట్‌ అయిన మరో ఇద్దరికీ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top