బెంబేలెత్తిస్తున్న ‘అసని’ తుపాన్‌.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

Cyclone Asani Meaning How And Why Cyclones Named - Sakshi

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఇది గంటకు 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో పాటు మరింత బలంగా మారే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సైక్లోన్ అసని అని పేరు పెట్టారు. ఈ తుపానుకు శ్రీలంక పేరుని సూచించింది. సింహళ భాషలో దీని అర్థం 'కోపం'. హుద్‌హుద్‌.. తిత్లీ.. పెథాయ్‌.. పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రాన్ని అతలాకుతులం చేసిన తుపానులు. తాజాగా ఇప్పుడేమో అసని తుపాను.

తుపాన్లకి అసలు పేరు ఎందుకు?
వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి.

ఉదాహరణకు ‘తిత్లీ’ పేరును పాకిస్థాన్ సూచించింది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు.  2018లో ఈ ప్యానెల్‌లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, యెమెన్‌ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఉచ్ఛరించడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీయకూడదు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top