డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్లను విచారించవచ్చు

Courts can hear pleas seeking default bail over non-filing of charge sheets - Sakshi

న్యూఢిల్లీ:  డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ దాఖలయ్యే పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. క్రిమినల్‌ కేసుల్లో దర్యాప్తు అధికారులు గడువులోగా చార్జిషీట్‌ దాఖలు చేయకపోతే డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ నిందితులు దాఖలు చేసే పిటిషన్లను హైకోర్టులు, ట్రయల్‌ కోర్టులు విచారించవచ్చంది. 60 నుంచి 90 రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయకుంటే నిందితులు ఢిపాల్ట్‌ బెయిల్‌కు అర్హులు.

విచారణ పూర్తవకుండానే అసంపూర్తి చార్జిషీట్‌ను దాఖలు చేసినా డిఫాల్ట్‌ బెయిల్‌ పొందవచ్చని రీతూ ఛాబ్రియా కేసులో జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్‌ 26న తీర్పు వెలువరించింది. కేవలం నిందితులకు డిఫాల్ట్‌ రావొద్దన్న కారణంతో చార్జిషీల్‌ దాఖలు చేయొద్దని సూచించింది.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ తీర్పును ఉపసంహరించుకోవాలని కోరింది. ఈడీ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కింది కోర్టులు రీతూ ఛాబ్రియా కేసు తీర్పుపై ఆధారపడాల్సిన అవసరం లేదని, డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్లపై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

కేంద్రంపై సుప్రీంకు ఆప్‌
ఢిల్లీ ప్రభుత్వాధికారులపై పాలనపరమైన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఈ విషయమై కేంద్రానికి, ఆప్‌ సర్కారుకు మధ్య గొడవలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వ సేవల శాఖ కార్యదర్శి ఆశిష్‌ మోరే బదిలీని కేంద్రం అడ్డుకుంటోందని కేజ్రీవాల్‌ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు వచ్చే వారం ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ పేర్కొన్నారు.

‘అదానీ’ విచారణకు 3 నెలలు?
అదానీ గ్రూప్‌ అవకతవకల ఆరోపణలపై విచారణకు సెబీకి మరో మూడు నెలలు గడువివ్వాలని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. విచారణలో సెబీ వైఫల్యముందన్న వాదనలను తిరస్కరించింది. సెబీ నివేదికను తమ నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక దానిపై తేలుస్తామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

కేరళ స్టోరీపై నిషేధం ఎందుకు ?
ది కేరళ స్టోరీ సినిమాను ఎందుకు నిషేధించారో చెప్పాలంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు సీజేఐ ధర్మాసనం నోటీసులిచ్చింది. ‘‘ఇతర రాష్ట్రాలు ఏ సమస్యా లేకుండా సినిమాను ప్రదర్శిస్తున్నాయిగా! దానివల్ల ఏమీ జరగలేదు. మరి మీరెందుకు నిలిపివేశారు? సినిమా నచ్చకపోతే ప్రజలే తిరస్కరిస్తారు’’ అని వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top