కరోనా, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల.. 300 భవనాలకు సీల్‌ 

Coronavirus Omicron: BMC Official Sealed 300 Buildings - Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో కరోనా, ఒమిక్రాన్‌ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బీఎంసీ అధికారులు 300పైగా భవనాలకు సీలు వేశారు. ఒక్కో భవనంలో లేదా వింగ్‌లో 20 శాతం ఇళ్లలో కరోనా రోగులుంటే సీల్‌ వేస్తామని బీఎంసీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పెరిగిన కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కట్టడి చర్యల్లో భాగంగా 300 పైగా భవనాలకు సీలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు, ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కరోనా రోగులు పెద్దసంఖ్యలో పెరిగారు. ముంబైలో గత రెండు రోజులుగా 25 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారం ఈ సంఖ్య మరింత పెరగడంతో బీఎంసీ అప్రమత్తమైంది. ముంబైసహా పుణే జిల్లాలో కూడా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోగులకు వైద్యం అందించే 364 మంది డాక్టర్లు కూడా వైరస్‌ బారిన పడ్డారు.

దీంతో ఈ వ్యాధి మరింత విస్తరించకుండా భవనాలకు, వింగ్‌లకు సీలు వేసినట్లు బీఎంసీ తెలిపింది. రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ముంబైకర్లు భయపడాల్సిన అవసరం లేదని మేయర్‌ కిషోరీ పేడ్నేకర్‌ శనివారం స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, బీఎంసీ ఆస్పత్రుల్లో, జంబో కోవిడ్‌ కేంద్రాలలో తగినన్ని బెడ్లు, ఐసీయూ, ఆక్సిజన్‌ వార్డులు సమకూర్చామని, ఆక్సిజన్‌ నిల్వలు కూడా తగినన్ని ఉన్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా నాలుగు రెట్లు వేగంగా విస్తరిస్తోందని, అయినప్పటికీ వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధించే ఆలోచన కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి లేదన్నారు.

కేసులపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ముంబై ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని, కోవిడ్‌ నియమాలు పాటిస్తే లాక్‌డౌన్‌ అమలుచేసే అవసరం రాదని ఈ సందర్భంగా ముంబైకర్లకు సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలోనూ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, చికిత్సకోసం ఆస్పత్రులకు వస్తున్న వారిసంఖ్య కూడా పరిమితంగానే ఉంటోందని మేయర్‌ వెల్లడించారు.
చదవండి: ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్‌’.. ప్రత్యేకతలివే.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top