మహారాష్ట్ర, కేరళలో కరోనా మళ్లీ విజృంభణ 

Coronavirus Cases Spike Again In Maharashtra And Kerala - Sakshi

కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం

సమీప రాష్ట్రాల్లో పెరుగుతుండటంతో ఆందోళన

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం

ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన 

వ్యాక్సిన్‌ను వేసుకోవడంలో అలక్ష్యం వద్దే వద్దు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మళ్లీ తన పంజా విప్పుతోంది. ఒకప్పుడు మహారాష్ట్రను గడగడలాడించిన మహమ్మారి ఇప్పుడు అక్కడ తిరిగి విజృంభిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్రలో ప్రతిరోజూ 3,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. తొలివారంతో పోలిస్తేనే 14 శాతం అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ముంబై, పుణే నగరాల్లో ప్రతిరోజు 600 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం 28 కేసులు నమోదు కాగా, మంగళవారం ఆ సంఖ్య 103కు పెరిగింది. మరోవైపు కేరళలోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేరళ నుంచి వచ్చేవారు తాజా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌టీపీసీఆర్‌)తో వస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని కర్ణాటక మంగళవారం ప్రకటించింది.

ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో మనకు సరిహద్దు ఎక్కువగా ఉంది. కేరళతో విస్తృత సంబంధాలున్నాయి. అక్కడకు చెందిన అనేకమంది నర్సులు, టీచర్లు మన రాష్ట్రంలో పనిచేస్తుంటారు. ఇక మహారాష్ట్ర నుంచి సరిహద్దు జిల్లాలకు రోజువారీ రాకపోకలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలకు నిత్యం అనేక విమాన సర్వీసులు నడుస్తాయి. రోజూ వేలాది మంది వస్తూ పోతుంటారు. దీంతో తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.  

నిలువెల్లా నిర్లక్ష్యం... 
రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం రోజుకు సగటున 150 వరకు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనాతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామన్న భావన ప్రజల్లో నెలకొంది. ఫలితంగా కరోనా జాగ్రత్తలు పాటించడంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవరించిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మాస్క్‌లు ధరించడం వృథా అన్న భావన నెలకొంది. భౌతిక దూరం పాటింపే లేదు. చేతులు శుభ్రం చేసుకోవడంలోనూ అశ్రద్ధ కనిపిస్తోంది. విచిత్రమేంటంటే వైద్యుల్లోనూ ఇటువంటి నిర్లక్ష్యం కనిపించడంతో సాధారణ ప్రజలు కూడా ఏమీ కాదన్న భావనతో ఉన్నారు. హోటళ్లు, కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్‌ కళాశాలల్లో కరోనా జాగ్రత్తలు పాటించడంలేదు. సినిమా హాళ్లు నిండిపోతున్నాయి. వాటిల్లో చాలామంది ప్రేక్షకులు మాస్క్‌లు ధరించడంలేదు. హాల్లోకి వచ్చాక తీసేస్తున్నారు. శుభకార్యాలకు గణనీయమైన సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. దీంతో కరోనా చాపకింద నీరులా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణమంటున్నారు.
చదవండి: సీఎం హెచ్చరిక.. మరోసారి లాక్‌డౌన్‌ దిశగా..? 
కోవిడ్‌ సక్సెస్‌ స్టోరీ.. ఒకే ఒక్క మరణం

వ్యాక్సిన్‌ తీసుకోవడానికీ అనాసక్తి... 
కరోనా వైరస్‌ను అరికట్టడానికి జాగ్రత్తలతో పాటు వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతుంది. బ్రిటన్, అమెరికా, యూరప్‌ దేశాల్లోనైతే వ్యాక్సిన్‌ కోసం జనం ఎగబడుతున్నారు. కానీ మన రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తీసుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందిలో 58 శాతం మంది మాత్రమే మొదటి డోస్‌ తీసుకున్నారు. ఇక పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూశాఖలకు చెందిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అయితే కేవలం 33 శాతమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. చిన్నపాటి భయాలను దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండగా, మరికొందరైతే వైరస్‌ తగ్గుముఖం పట్టింది టీకా ఎందుకని తేలికగా తీసుకుంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్రస్థాయి కీలక అధికారులు, కొన్ని విభాగాల అధిపతులు కూడా వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైరస్‌ లింక్‌ను వ్యాక్సిన్‌తో కట్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే, ఇలా టీకా తీసుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ తిరగబడే పరిస్థితి ఏర్పడనుంది.

జూన్‌ నాటికి మళ్లీ విజృంభణ  
మహారాష్ట్ర, కేరళలో కేసులు పెరుగుతున్నందున ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలి. వ్యాక్సిన్‌ను లబ్ధిదారులంతా వేసుకోవాలి. జాగ్రత్తలు పాటించకుండా, వ్యాక్సిన్‌ వేసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే జూన్‌ నాటికి వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. 
– డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు 

 జాగ్రత్తలే శ్రీరామరక్ష
►మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున అక్కడి నుంచి వచ్చేవారిపై నిఘా పెట్టాలి. స్క్రీనింగ్‌ చేపట్టి... అనుమానితుల్ని ఐసోలేట్‌ చేయాలి.  
►లక్షణాలున్న వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. సాధారణ జలుబు, జ్వరమే అనుకోకుండా టెస్ట్‌లు తప్పనిసరి.  
►అర్హులైన వారంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. త్వరలో 50 ఏళ్లు పైబడిన, ఆలోపు వయస్సుగల వారికి కూడా టీకా వేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 70 లక్షల మంది వరకు ఈ వయస్సు వారు ఉంటారు. వారంతా టీకా తీసుకోవాలి.  
► వ్యాక్సిన్‌ వేసుకున్నా, లేకపోయినా మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. 
► మాస్కే మనకు శ్రీరామ రక్ష. 
► గుంపుల్లోకి వెళ్లకూడదు. వెళ్లినా భౌతిక దూరం పాటించాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.  
► వీలైనంత మేరకు ప్రయాణాలు తగ్గించాలి. తప్పనిసరైతేనే శుభకార్యాలు నిర్వహించాలి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top