కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ విషాదం: లూప్‌లైన్లోకి మళ్లించినందుకే ఘోర ప్రమాదం జరిగిందా?

Coromandel Express accident because it was diverted into loop line - Sakshi

20 సెకెన్లలో 128 నుంచి 0 స్పీడ్‌కు 

ప్రమాదానికి గురైన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగ పతనమిదీ  

లూప్‌లైన్‌లోకి సిగ్నల్‌ ఇవ్వడమే ప్రమాదానికి కారణమా?

గూడ్స్‌ రైలు లేదని చెబుతున్న అధికారులు  

కానీ.. ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్న గూడ్స్‌ బోగీ  

సాక్షి, విశాఖపట్నం:  ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రమాదానికి గురై,  వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తోంది.

అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్‌ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్‌కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు.  

అధికారులు ఏం చెబుతున్నారంటే...
రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై స్పందించారు. సాయంత్రం 6.55 గంటల సమయంలో బహనాగ రైల్వేస్టేషన్‌ వద్ద స్టాప్‌ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. పక్కన ఉన్న ట్రాక్‌పైకి కోరమండల్‌ కోచ్‌లు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్‌–హౌరా ఎక్స్‌ప్రెస్‌ పడిపోయిన కోచ్‌లని ఢీకొట్టడంతో ఆ ట్రైన్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు.   

అసలు జరిగిందేమిటి?  
అధికారులు చెబుతున్న దానికి, ప్రమాదం సంభవించిన పరిస్థితుల్ని గమనిస్తే.. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వేగంగా వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూస్తే అక్కడ గూడ్స్‌ రైలు కూడా ఉందని స్పష్టమవుతోంది. స్టేషన్‌ వద్ద.. మధ్యలో ఉన్న లూప్‌లైన్‌లో గూడ్స్‌ రైలు ఆగి ఉంది. స్టేషన్‌లో స్టాప్‌ లేనప్పుడు రైలుకు మెయిన్‌ లైన్‌లో ట్రాక్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోరమాండల్‌కు లూప్‌లైన్‌లో సిగ్నల్‌ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెయిన్‌ లైన్‌లో నుంచి వెళ్లకుండా లూప్‌లైన్‌లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్‌ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ  రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకో గూడ్స్‌ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top