గూడ్స్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు.. ఎనిమిది మంది మృతి.. 14 మందికి గాయాలు
బిలాస్‌పూర్ సమీపంలో ఘటన
బిలాస్‌పూర్: గూడ్స్‌ను ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో లోకో పైలట్ సహా 8 మంది చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. మెము(మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మలి్టపుల్ యూనిట్) రైలు కొర్బాలోని గెవ్రా నుంచి పొరుగునే ఉన్న బిలాస్‌పూర్ వైపు వెళుతోంది. గటోరా–బిలాస్‌పూర్ స్టేషన్ల మధ్య ఉండగా మెము రైలు ముందు వెళ్తున్న గూడ్స్‌ను ఢీకొట్టింది. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ప్యాసింజర్ రైలు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు మెలికలు తిరిగిపోయిన ప్యాసింజర్ రైలు బోగీ ఒకటి గూడ్స్ రైలు వ్యాగన్లపైకి ఎక్కింది.
ఘటనలో లోకో పైలట్, ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అసిస్టెంట్ లోకో పైలట్ రష్మీరాజ్ తీవ్రంగా పడ్డారు. గూడ్స్ రైలు గార్డ్ ఆఖరి క్షణంలో బయటకు దూకి స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నుజ్జయిన రైలు బోగీలో చిక్కుకున్న మరో ఇద్దరు లేదా ముగ్గురిని వెలుపలికి తీసేందుకు భారీ యంత్ర సామగ్రి, గ్యాస్ కట్టర్లతో ప్రయత్నాలు చేస్తున్నామని బిలాస్‌పూర్ కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. క్షతగాత్రులను బిలాస్‌పూర్‌లోని అపోలో, ఛత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సీఐఎంఎస్)లో చేరి్పంచామన్నారు.
14 మందికిగాను ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రైళ్లు ఢీకొని ఒక్కసారిగా వచ్చిన శబ్ధంతో ఉలిక్కి పడిన సమీప గ్రామస్తులు అక్కడికి చేరుకుని, రక్షణ చర్యల్లో పాలుపంచుకున్నారన్నారు. రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.లక్ష అందజేస్తామని ప్రకటించింది. ఘటనకు దారి తీసిన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సేఫ్టీ కమిషనర్ స్థాయిలో సవివర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. గూడ్స్ రైలు, రెడ్ సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తున్నా లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను వాడటంలో విఫలమవడంపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. సహాయక, ట్రాక్ పునరుద్ధరణ చర్యలను రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని, స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం కారణంగా హౌరా–ముంబై సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


