మహిళా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన బామ్మ

UP Cops Begin Probe MLA Grandmother  Accuses Her Of Harassment - Sakshi

ఎమ్మెల్యే అదితి సింగ్‌పై ఆరోపణలు చేసిన బామ్మ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ ‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్‌పై ఆమె బామ్మ కమలా సింగ్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం మనుమరాలు తనను వేధిస్తోందంటూ పోలీసులకు ఆశ్రయించారు. ఈ మేరకు ఆగష్టు 10న కమలా సింగ్‌ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ స్వప్నిల్‌ మాంగేన్‌ గురువారం వెల్లడించారు. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై వాస్తవాలు వెలికి తీసే బాధ్యతను అదనపు ఎస్పీ నిత్యానంద్‌ రాయ్‌కు అప్పగించినట్లు తెలిపారు. ‘‘రాయ్‌ బరేలీ కొత్వాలీ పోలీస్‌ స్టేషన్‌లో కమలా సింగ్‌ ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదంలో తనను వేధిస్తున్నటట్లు తెలిపారు. అదనపు ఎస్పీ ఈ కేసును విచారించనున్నారు. అయితే ఇంతవరకు ఫిర్యాదుదారు, ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: మనిషిలా ఉండే మనిషి అదితి!)

కాగా మహరాజ్‌గంజ్‌లోని లాలుపూర్‌ గ్రామంలో నివసించే 85 ఏళ్ల కమలా సింగ్‌.. అదితీ సింగ్‌, ఆమె బంధువులు తనను బెదిరింపులకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబరు 30, 2019న తన ఇంట్లో ప్రవేశించి ఆస్తి మొత్తం వారి పేరిట బదిలీ చేయనట్లయితే చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారన్నారు. ఇక ఈ విషయంపై అదితి సింగ్‌ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు అందినప్పటికీ ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: లేఖ: యూపీ కాంగ్రెస్‌ నేతపై చర్యలు!? )

పెద్దలను గౌరవించాలని నేర్పలేదా?
ఇక అదితిపై ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘‘అదితి సింగ్‌ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆ లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి. పెద్దల్ని గౌరవించమని బీజేపీ చెప్పలేదా’’అని తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇందుకు స్పందించిన యూపీ బీజేపీ కార్యదర్శి చంద్రమోహన్‌.. ‘‘సిగ్గుపడాలి. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు వెంపర్లాడటం సరైంది కాదు. అదితి జీ ఏ పార్టీకి చెందినవారన్నది అప్రస్తుతం. తను ఒక మహిళ, ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకోండి. అది వారి వ్యక్తిగత విషయం. కాంగ్రెస్‌ పార్టీ నైతిక విలువలను పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది’’అని ఎద్దేవా చేశారు. కాగా  

సొంత పార్టీపై విమర్శలు చేసి..
కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులను స్వస్థలానికి చేర్చేందుకు అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ వెయ్యి బస్సులు ఏర్పాటు చేసినట్లు యూపీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార బీజేపీ ఆ బస్సుల జాబితాను తెప్పించుకుని పరిశీలించగా.. వాటిలో సగానికి పైగా కండిషన్‌లో లేని బస్సులే ఉన్నట్లు తేలింది. 297 బస్సులు తప్పుపట్టి ఉండగా.. 98 ఆటో–రిక్షాలు, అంబులెన్స్‌ వంటి కొన్ని వాహనాలు కూడా ఆ బస్సుల జాబితాలో చేరి ఉన్నాయి. 

ఇక మరో 68 వాహనాలకైతే అసలు పేపర్‌లే లేవు. ఇక ఈ విషయంపై ఘాటుగా స్పందించిన అదితి సింగ్‌ సొంత పార్టీ మీదే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంతకన్నా చవకబారు రాజకీయం ఉందా? వలస కార్మికుల మీద వేసిన క్రూయల్‌ జోక్‌ కాదా ఇది’’ అని బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే కాంగ్రెస్‌ పార్టీ ఆమెను ప్రధాన  కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. అంతేగాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికి.. పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరీ హాజరైనందుకు అదితిని ఎమ్మెల్యేగా అనర్హురాలిని చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top