పశ్చిమాసియా పరిణామాలపై రాజకీయ లబ్ధి కోసం పాకులాట
వదంతులతో ప్రజల్లో భయాందోళనల సృష్టి: మోదీ
థరాడ్/గాందీనగర్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాబందులా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి పశ్చిమాసియా పరిణామాలను వాడుకుంటోందని మండిపడ్డారు. ఆ ఉద్రిక్తతలు మనపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. మంగళవారం గుజరాత్‌లోని వావ్ థరాడ్ జిల్లా నానీ గ్రామంలో మోదీ పర్యటించారు.
రూ.19,806 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఖేడ్‌బ్రహ్మ–హిమ్మత్‌నగర్–అసర్వా రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ కట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ నేతలు విచ్చింన్న రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితులు అదుపు తప్పితే దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి కాంగ్రెస్ కాచుకొని ఉంది’’ అని దుయ్యబట్టారు.
ఇంధన భారం పడకుండా చర్యలు
పలు దేశాలు యుద్ధం, అశాంతి, అస్థిరతలో కూరుకుని ఉంటే భారత్ మాత్రం సుస్థిరత, ఐక్యతను ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం కొరత పెరిగిందని గుర్తుచేశారు. ఇంతటి సంక్షోభంలోనూ మన బలమైన విదేశాంగ విధానం, పౌరుల సమష్టి కృషితో ప్రతికూల పరిస్థితిని విజయవంతంగా నియంత్రిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచమంతటా ఇంధనం ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయన్నారు. ఈ భారం మన ప్రజలపై పడకుండా చర్యల చేపటినట్లు వెల్లడించారు.
శాంతి, అహింస సందేశం
ప్రపంచ అస్థిరత, అశాంతి మంటల్లో చిక్కుకున్న నేటి తరుణంలో సామ్రాట్ సంప్రాతి మ్యూజియం శాంతి, అహింస సందేశాన్ని ఇస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ సమీపంలో శ్రీమహావీర్ జైన్ ఆరాధన కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మ్యూజియం వారసత్వం, సందేశం మన దేశానికే కాకుండా మొత్తం మానవాళికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు.
విశ్వసనీయ సరఫరాదారు భారత్
గుజరాత్‌లోని సనంద్‌లో కేనెస్ సెమీకాన్ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్‌ను మోదీ ప్రారంభించారు. సెమీకండక్టర్లలో మనదేశం విశ్వసనీయ సరఫరాదారుగా మారిందని చెప్పారు. ‘‘21వ శతాబ్దం పలు సవాళ్లు తెచి్చంది. సంఘర్షణల వల్ల ప్రపంచ సప్లై చైన్లు ప్రభావితమయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో సాంకేతికత, ఇంధన భద్రతకు మా ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది’’ అని వివరించారు.


