చొరబాటుదారుల కోసం మన ప్రజలను బలి చేస్తారా?
ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం
భాగల్పూర్: బిహార్‌లో ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రెండు పార్టీలు చొరబాటుదారులపై అంతులేని అనురాగం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శ్రీరాముడిని, ఛఠ్ పూజలను వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకును సంతృప్తిపర్చడానికి మన సంప్రదాయాలను తూలనాడుతున్నారని విమర్శించారు. గురువారం బిహార్‌లోని భాగల్పూర్, అరారియా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ప్రతిపక్ష నాయకులు అయోధ్య రామాలయాన్ని ఇప్పటికీ దర్శించుకోలేదని గుర్తుచేశారు. నిశాద్‌రాజ్, మాత శబరి, మహర్షి వాల్మికికి సంబంధించిన పవిత్ర క్షేత్రాలకు కూడా వెళ్లలేదని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులపై విపక్షాలు విద్వేషం చూపుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 15 ఏళ్ల జంగిల్‌రాజ్ పాలనలో జరిగిన అభివృద్ధి గుండు సున్నా అని దుయ్యబట్టారు. రహదారులు, వంతెనలు, ఉన్నత విద్యా సంస్థలు నిర్మించలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుఆమర్ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించిందని చెప్పారు.
‘‘ఈరోజు బిహార్‌లో అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. జాతీయ రహదారులు, వంతెనలు నిర్మితమయ్యాయి. నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రగతి ప్రయాణం నిరాటంకంగా కొనసాగాలంటే ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే ప్రజలు ఆలోచించి ఓటువేయాలి. ఈ అభివృద్ధి వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ప్రధానంగా చొరబాటుదారుల నుంచి పెద్ద సవాలు ఎదురయ్యింది.
ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు ఘన స్వాగతం పలుకుతాయి. ప్రతిపక్షాలకు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం. కానీ, అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారితో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. స్థానికులు నష్టపోతున్నారు. మన పౌరుల ఆస్తుల్లో వాటా కావాలని చొరబాటుదారులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పరాయివాళ్ల కోసం మన ప్రజలను బలి చేయడం ఎంతవరకు న్యాయమో ప్రతిపక్ష నాయకులే చెప్పాలి’’ అని మోదీ ప్రశ్నించారు.
ఒక్క ఓటు సైతం విలువైనదే
బిహార్‌లో తొలి దశ పోలింగ్‌లో జనం చురుగ్గా పాల్గొనడం సంతోషం కలిగిస్తోంది. యువత, వృద్ధులు అనే తేడాలేకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహం ముందుకొస్తున్నారు. పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరుతున్నారు. మరోసారి జంగిల్‌రాజ్ అధికారంలోకి రాకుండా చూడాలన్న పట్టుదల మహిళల్లో కనిపిస్తోంది. ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనది. ఓటు శక్తి ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆర్జేడీ పాలనలో అరాచకం రాజ్యమేలిన సంగతి మర్చిపోవద్దు. ఇక కాంగ్రెస్ డిక్షనరీలో స్వదేశీ, అత్మనిర్భరత అనే పదాలే లేవు. స్వయం సమృద్ధి, స్వదేశీ ఉత్పత్తులతో పేదలు లబ్ధి పొందడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. విపక్ష కూటమికి సొంత కుటుంబాలు, సొంత ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం అంటే ఏమిటో కూడా తెలియదు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం కాంగ్రెస్‌దే. బిహార్‌లో అత్యంత అవినీతి కుటుంబం ఆర్జేడీదే’’ అని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.


