ఎన్నికల్లో లబ్ధి కోసమే
పార్లమెంట్ ప్రత్యేక భేటీ
సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘ కాలం మౌనంగా ఉండి, ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం వెనుక కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుతంత్రం దాగి ఉందని మండిపడ్డారు.
శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం (సీడబ్ల్యూసీ)లో ఆయన ప్రారం¿ోపన్యాసం చేశారు. కేంద్రం వైఖరిని ఎండగట్టారు. సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, కీలక నేతలు ప్రియాంకా గాం«దీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు.
అమలు లేని రిజర్వేషన్ ఎందుకు?...
‘ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదు. ప్రధాని రాసే వ్యాసాలు చదివి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం.. ఈ రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేవలం ఈ ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ బిల్లును తెస్తున్నారు’అని ఖర్గే విమర్శించారు.
డీలిమిటేషన్ వెనుక కుట్ర...
లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కు పెంచాలన్న ప్రతిపాదనపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం ముందుకు తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ‘డీ లిమిటేషన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైంది. దీనిపై లోతైన చర్చ జరగాలి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఎంపీలు బిజీగా ఉన్న సమయంలో సమావేశాలు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం నిబంధనల ఉల్లంఘనే. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. అది హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగంలా మారిపోయింది. అందుకే ఈ కోడ్ ఉల్లంఘనలను వారు పట్టించుకుంటారని మేం ఆశించడం లేదు’అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం
మహిళా సాధికారత విషయంలో తమకు ఎవరి సరి్టఫికెట్లు అవసరం లేదని ఖర్గే స్పష్టం చేశారు. ‘స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల వల్లే నేడు స్థానిక సంస్థల్లో 14.5 లక్షల మంది మహిళలు ప్రతినిధులుగా ఉన్నారు. 2023లోనే ఈ బిల్లుపై మేం హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ అనేకసార్లు ప్రధానికి లేఖలు రాశారు. జనగణన, డీ లిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిపై విపక్షాలతో కలిసి ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్తాం’అని ఖర్గే వెల్లడించారు.
వచ్చే వారం ప్రతిపక్ష నేతలతో ఖర్గే భేటీ
ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో సమావేశం జరపనున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కాకుండా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అయితే, ఇందుకు సమాచారాన్ని ప్రభుత్వం ఇంతవరకు ప్రతిపక్షాలకు అందజేయలేదని ఆరోపించారు. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ చీఫ్ ఖర్గేఅధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం జరుగుతుందన్నారు.


