
యూజర్లలో అత్యధికుల అభిప్రాయం ఇదే
ఫోన్ పాడైతే డేటా నష్టపోతామన్న ఆందోళన
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్చ్ తాజా సర్వేలో వెల్లడి
నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. చేతిలో ఫోన్ ఉండాల్సిందే. నిద్ర లేకపోయినా, తిండి తినకపోయినా ఫోన్ ఉంటే చాలనుకునే జనమూ ఉన్నారు. అంతలా స్మార్ట్‌ఫోన్స్ జీవితంలో భాగమయ్యాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉపకరణం చేజారితే గుండె పగిలినంత పని అవుతుంది. ఈ ఫీలింగ్ ఏ ఒక్కరికో పరిమితం కాదు. దేశంలో అత్యధికులది ఇదే మాట. – సాక్షి, స్పెషల్ డెస్క్
టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తమ స్మార్ట్‌ఫోన్ పగిలిపోయినప్పుడు, కింద పడిపోయినప్పుడు కలత, భయాందోళనకు గురైనట్లు సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది తెలిపారు.
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు నిర్ణయాలను మన్నిక ప్రభావితం చేస్తోంది. కాబట్టే మన్నిక చాలా ముఖ్యమైన అంశంగా 79 శాతం యూజర్లు భావిస్తున్నారు. తరచూ వాడుతుంటారు కాబట్టి చేతి నుంచి ఫోన్ కింద పడడం సహజం. అలా పడినప్పుడు పాడవకుండా బలమైన స్క్రీన్ ఉండాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. అలాగే బలమైన ఫ్రేమ్, నీట తడిసినా ఏమీకాని వాటర్ రెసిస్టెన్స్ సౌకర్యమూ ఉండాల్సిందేనంటున్నారు.
డేటా కోల్పోతామని..
ఫోన్ అంటేనే ఒక ప్రపంచం. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలతో ముడిపడినది. ఫోన్ పాడైతే డేటా నష్టపోతామన్న భయం చాలామందిలో ఉంది. దాదాపు 89 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్‌లు, చాట్‌లు డిలీట్ అవుతాయని ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అందుకే 90 శాతం మంది కస్టమర్లు తమ ఫోన్లకు కవర్స్, స్క్రీన్ గార్డ్స్‌తోపాటు బీమా తీసుకుంటున్నారు. ఫోన్ వేడెక్కడం (41 శాతం), బ్యాటరీ సమస్యలు (32), ప్రమాదవశాత్తు నష్టం వాటిల్లడం (32 శాతం) వంటి సమస్యలు సైతం యూజర్లను ఆందోళన కలిగిస్తున్నాయి.
గుదిబండగా మరమ్మతు
ఫోన్స్ రిపేర్ గుదిబండగా భావిస్తున్నారు. రిపేర్ అంటేనే ఖరీదైన వ్యవహారంగా మారిందని కస్టమర్లు చెబుతున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు మరమ్మతు ఖర్చుల కోసం రూ.2,000 కంటే ఎక్కువ ఖర్చు చేశారని సర్వేలో తేలింది. దాదాపు 29 శాతం మంది కస్టమర్లు ఫోన్ రిపేర్ కోసం రూ.5,000 కంటే ఎక్కువ వెచ్చించినట్టు తెలిపారు.
‘మన్నిక’పై అధ్యయనం
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇండియా తరఫున కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఈ సర్వే చేపట్టింది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ‘మన్నిక’అనే అంశం పాత్రను అర్థం చేసుకోవడం లక్ష్యంగా అధ్యయనం జరిగింది. దేశంలోని ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో 4,564 మంది వినియోగదారుల నుంచి సమాచారం సేకరించి నివేదిక రూపొందించారు.
» 78% మంది వినియోగదారులు తమ ఫోన్స్ దెబ్బతింటాయనే భయంతో వర్షం, తీవ్ర ఎండ వంటి కఠిన పరిస్థితుల్లో ఉపయోగించడం లేదు.
» 95% మంది యూజర్లు తమ ఫోన్ పగిలిపోయినప్పుడు, పడిపోయినప్పుడు కలత, ఆందోళనకు గురవుతున్నారు.
» 79% మంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ మన్నిక అత్యంత ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు.
» 89% మంది తమ ఫోన్ పాడైతే వ్యక్తిగత డేటాను కోల్పోతామని భయపడుతున్నారు. ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్‌లు, చాట్స్ డిలీట్ అవుతాయని ఆందోళన చెందుతున్నారు.