
నాజూకైన నగుమోముకు సరికొత్త ట్రెండ్
ముఖాన్ని ‘షేప్’ చేసుకునేందుకు మహిళల ఆసక్తి
నాణ్యమైనవి కాకుంటే ప్రమాదమంటున్న వైద్యులు
సాక్షి, స్పెషల్ డెస్క్: ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఫ్యాషన్ స్పెషలిస్టుల దగ్గర ‘ఫేషియల్ యోగా’ మొద లు ‘గ్వాషా’ మసాజ్, ఫేషియల్ కప్పింగ్ వరకు ఎన్నో విద్యలు ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు ‘ఫేషియల్ కంప్రెషన్ బ్యాండ్స్’ (ముఖాన్ని పట్టి ఉంచే పట్టీలు) ట్రెండింగులోకి వచ్చాయి. నిపుణుల సహాయం లేకుండా ఎవరికి వారుగా వీటిని ధరించే సౌలభ్యం ఉండటంతో వీటిపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు.
‘చెవులు, దవడల మీదుగా నిలువుగా ముఖం చుట్టూ కంప్రెషన్ బ్యాండ్‌ను అమర్చుకుని కొన్ని గంటల తర్వాత తొలగిస్తే చాలు. ముఖం బక్కచిక్కి చక్కనమ్మల్ని చేస్తుంది. నాజూకు నగుమోము మీ సొంతమవుతుంది’ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తున్నాయి. కంప్రెషన్ బ్యాండ్స్‌నే ఫేస్ స్లిమ్మింగ్ బ్యాండ్స్, వి–లైన్ లిఫ్టింగ్ బ్యాండ్స్ / మాస్క్ అని కూడా అంటున్నారు. అయితే, ముఖంలో షేప్ తీసుకురావటానికి ధరించే ఈ ఎలాస్టిక్ పట్టీలు నిజంగానే ముఖాన్ని నాజూకుగా మార్చేస్తాయా అంటే.. పూర్తిగా కాదు అంటున్నారు కాస్మెటాలజిస్టులు.
బ్యాండ్స్ ఏం చేస్తాయి?
ముఖాన్ని కంప్రెషన్ బ్యాండ్ పట్టి ఉంచుతుంది. అంటే ముఖాన్ని బిగించేస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా ముఖం ఉబ్బడం తగ్గుతుంది. చర్మంలో ఉబ్బుకు కారణమయ్యే కణజాల ద్రవాన్ని తిరిగి ప్రసరణలోకి పంపే లింఫటిక్ డ్రైనేజ్ వ్యవస్థ క్రియాశీలం అవుతుంది. దాంతో ముఖ చర్మం బిగుతుగా మారి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫేస్ మసాజ్‌లో జరిగేది కూడా ఇదే.
వరంలా మారుతోంది!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్‌లోకి వస్తుందో తెలీదు. ఈ ఫేస్ బ్యాండ్ కూడా ఇప్పుడు అలాగే ట్రెండ్ అవుతోంది. దవడల్ని పదునెక్కించి, ముఖ చర్మంలోని వదులును తగ్గించుకునేందుకు మహిళలు ఈ కంప్రెషన్ బ్యాండ్‌ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కాస్మెటిక్స్ వాడటం ఇష్టం లేనివారికి ఇదొక వరంలా కనిపిస్తోంది. పైగా వీటిని ఇంట్లోనే అమర్చుకోవచ్చు. ఎవరికీ కనిపించకూడదు అనుకుంటే.. రాత్రుళ్లు పెట్టుకుని పడుకోవచ్చు. తీసిన కొన్ని గంటల వరకు ముఖ్యం పలుచగా, తేటగా కనిపిస్తుంది.
మైనస్‌లూ ఉన్నాయి
నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి కంప్రెషన్ బ్యాండ్‌లు పైకి హాని చేయనివిగా కనిపించవచ్చు కానీ, వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం సురక్షితం కావు. ‘బ్యాండ్ పట్టి ఉంచే ఒత్తిడికి ముఖంలో అసౌకర్యంగా ఉంటుంది. తలనొప్పి రావచ్చు. రక్త ప్రసరణ పరిమితం కావచ్చు. బ్యాండ్ లోపలి వైపు చర్మానికి చెమట పట్టి దద్దుర్లు తేలొచ్చు. పైగా ఎక్కువసేపు ధరించటం వల్ల ముఖంపై నొక్కులు పడతాయి. తిమ్మిరి కూడా ఉండొచ్చు’ అంటున్నారు చర్మవైద్య నిపుణులు.
నాణ్యమైనవి కాకుంటే?
‘కంప్రెషన్ బ్యాండ్‌లు నాణ్యమైనవి కాకపోతే అది మరో సమస్య. అందువల్ల ముఖానికి వదులుగా గానీ, బిగుతుగా గానీ అనిపించవచ్చు. సమానంగా కాకుండా ఎగుడు దిగుడుగా సాగొచ్చు. దవడ, చెవులపై అధిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఇందువల్ల కొన్నిసార్లు తల తిరిగినట్లు కూడా అవుతుంది’ అని చెప్తున్నారు కాస్మెటాలజిస్టులు.
సర్జరీల తరవాత!
ఫేస్ లిఫ్టింగ్ స్ట్రాప్స్ లేదా చిన్ స్ట్రాప్ అని కూడా వాడుకలో ఉన్న ఫేషియల్ కంప్రెషన్ బ్యాండ్‌లు సాధారణంగా శస్త్ర చికిత్స తర్వాత కోలుకోవటానికి కొంతవరకు ఉపయోగపడతాయి. అవి మెడపై స్థిరమైన ఒత్తిడి ఉండేలా చూస్తాయి. మఖానికి, నోటికి శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఆ వాపును, గాయాలను తగ్గించటానికి రక్త ప్రసరణ మెరుగయ్యేలా ఈ బ్యాండ్‌లు సహాయపడతాయి. కొంతమంది డబుల్ చిన్ (దవడ కింద చర్మం జారిపోవడం) వంటివి తగ్గించుకోవడానికి వాడుతుంటారు.
ముఖ వ్యాయామాలు ఉత్తమం
ఫేషియల్ బ్యాండ్‌ల కంటే ముఖ వ్యాయామాలు ఉత్తమమని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ‘చెంప, దవడల వ్యాయామాల వంటివి ముఖ కండరాలను బలోపేతం చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సాయపడతాయి. వైద్యులు సూచించే కొన్ని ఔషధాలతోనూ ముఖ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు’ అని వారు సలహా ఇస్తున్నారు.
థెరపీలూ, చికిత్సలూ!
రేడియోఫ్రీక్వెన్సీ, అ్రల్టాసౌండ్ థెరపీ, లేజర్ లైటింగ్ వంటి చికిత్సలతో ముఖ చర్మాన్ని దీర్ఘకాలం చక్కటి ఆకృతిలో ఉంచుకోవటం సాధ్యమేనని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ముడతలను పోగొట్టే డెర్మల్ ఫిల్లర్‌లు, బొటాక్స్ ఇంజెక్షన్‌లు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని సూచిస్తున్నారు.
జీవనశైలి.. చక్కటి పరిష్కారం
ముఖ సౌందర్యానికి డైటీíÙయన్లు చెబుతున్న కొన్ని ప్రధాన సూచనలు
– రోజూ సరిపడా నీళ్లు తాగటం
– కంటి నిండా నిద్రపోవడం
– ముఖాన్ని రోజుకు కనీసం రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవడం
– ఒత్తిడి, ఆందోళన దరిచేరకుండా ఆనందంగా ఉండటం
– అన్ని రకాల పోషకాలూ ఉండే ఆహారం తీసుకోవడం
– ఉదయపు ఎండలో తగినంత వ్యాయామం చేయడం
– ఆహారంలో ఉప్పు తగ్గించటం
– బరువు పెరగకుండా జాగ్రత్త పడటం