పశ్చిమ బెంగాల్ రాజకీయాలను దిశానిర్దేశం చేసేది 27–30 శాతం ముస్లింలే
(సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి)
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే. దాంతో అక్కడి పార్టీల తలరాతను మార్చగలిగే శక్తిగా ముస్లింలు ఎదిగారు. దీంతో ఈసారి వాళ్లు ఎవరికి పట్టంకడతారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తృణమూల్‌కు మొదటి నుంచీ ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు.
వీరి దన్నుతోనే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూనే హిందూ ఓట్లను ఐక్యం చేసే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముస్లిం ఓటర్లు రాష్ట్రంలోని కనీసం 110 స్థానాల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. దీంతో మరోసారి ముస్లింల ఐక్యత మరోసారి తృణమూల్‌ను విజయతీరాలకు చేరుస్తుందా? లేదంటే వీరిలో ఐక్యత దీపం కొండెక్కి తృణమూల్ పడవను ఓటమి సముద్రంలో ముంచేస్తుందా? లేదంటే చీలిక తెచ్చి బీజేపీ ఘన విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది.
పథకాలతో లబ్ధిపొందిన ముస్లింలు
ముస్లింల మద్దతు వెనుక కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేకాకుండా పక్కాగా అమలు చేసిన వ్యూహాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సమీకరణాలున్నాయి. ముఖ్యంగా...టీఎంసీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి మద్దతును ఏర్పరచాయి. మహిళల కోసం ‘లక్ష్మీ భండార్’, విద్యార్థుల కోసం ‘సబుజ్ సాథి’, బాలికల విద్యను ప్రోత్సహించే ‘కన్యాశ్రీ’వంటి పథకాలు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రత్యక్ష లాభం చేకూర్చాయి.
ఈ పథకాలు మతాలకు అతీతంగా అమలయ్యాయి. దీంతో ముస్లిం వర్గాలు ఈ పథకాల నుంచి ఎక్కువ మంది లబి్ధపొందాయి. మైనారిటీ వర్గాలపై టీఎంసీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మదర్సాల అభివృద్ధి, ముస్లిం విద్యార్థులకు స్కాలర్íÙప్‌లు, మతపరమైన నాయకులకు గౌరవ వేతనాలు వంటి చర్యలు ‘ప్రభుత్వం మన కోసం పని చేస్తుంది’అనే భావనను ముస్లింలలో బలంగా నాటాయి. ఈ భావన రాజకీయంగా టీఎంసీకి కీలక మద్దతుగా మారింది.
గడిచిన పదేళ్లుగా ప్రధాన పోరు బీజేపీ, టీఎంసీల మధ్యే నెలకొంది. బీజేపీ హిందూ రాజకీయాలతో పోలిస్తే టీఎంసీ సర్వమత సహకార భావనే ముస్లింలను ఆ పార్టీకి దగ్గర చేసిందని తెలుస్తోంది. ముస్లింల ఈ రక్షణాత్మక భావనే తమ గెలుపునకు భరోసా అని టీఎంసీ నేతలు ఆశిస్తున్నారు. టీఎంసీ అయితేనే తమ ప్రయోజనాలకు పరిరక్షణగా నిలబడుతుందనే యోచన ముస్లింలలో బలంగా నాటుకుపోయింది.
ఈ ఐక్యతే టీఎంసీకి గతంలో గంపగుత్తగా ఓట్లు పడేలా చేసింది. స్థానికంగా ముస్లిం నాయకత్వానికి టీఎంసీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, ప్రాంతీయ నాయకులను ప్రోత్సహించడంతో ప్రజల్లో ప్రాతినిధ్యం ఉన్న భావన పెరిగింది. ఇది ఓటర్లతో నేరుగా అనుబంధాన్ని ఏర్పరచింది.
ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణాలు వంటి ముస్లిం ప్రభావిత జిల్లాల్లో టీఎంసీకి బలమైన కేడర్ ఉంది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓటును సమీకరించడంలో ఇవన్నీ కీలకంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల బలహీనత టీఎంసీకి అనుకూలంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఒకింత ముస్లిం ఓటు బ్యాంక్ ఉండేది. అయితే క్రమంగా ఈ రెండు పార్టీలు ప్రభావం కోల్పోవడంతో ప్రత్యామ్నాయం లేక ముస్లింలు టీఎంసీని ఆశ్రయించారు.
హిందువులను ఐక్యం చేసే పనిలో కమలదళం
బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్న ప్రధాన వ్యూహాల్లో ఒకటి ముస్లిం ఓటును విభజించడం. రెండోది హిందూ ఓటును ఐక్యంగా మార్చడం. ఈ ద్వంద్వ వ్యూహమే 2019 నుంచి పార్టీని బెంగాల్‌లో ముందుకు నడిపిస్తోంది. ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయకుండా వాళ్లను రెండు, మూడు పార్టీల వైపు చూసేలా చేయడమే బీజేపీ లక్ష్యంగా కని్పస్తోంది. ప్రత్యక్షంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కన్నా కాంగ్రెస్, లెఫ్ట్, చిన్న ప్రాంతీయ పార్టీల వైపు ముస్లిం ఓటర్లు చూసేలా బీజేపీ పరోక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని వార్తలొచ్చాయి. హిందువులను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ మతపరమైన గుర్తింపును బలంగా ప్రస్తావిస్తోంది.
సమూహ భావనను బీజేపీ ముందుకు తెస్తోంది. ముఖ్యంగా ‘సాంస్కృతిక పరిరక్షణ’, దేవాలయాలపై దాడులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందువుల్లో ఐక్యత పెంపొందేలా శతథా కృషిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమశూద్రులు, రాజ్‌బంశీలు వంటి వర్గాల్లో బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఈ వర్గాల మధ్య ప్రస్తావించడం ద్వారా తమ మద్దతును బలోపేతం చేసేందుకు ప్రయతి్నస్తోంది. జంగిల్‌మహల్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం పెంచుకుంది. బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో హిందువుల జనాభా ఎక్కువ. ఇక్కడ బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
కబీర్ మరో ఒవైసీ అవుతారా..?
తృణమూల్‌కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ‘బాబ్రీ మసీదు నమూనాలో మసీదు కడతా’ అంటూ ఆయన మొదటుపెట్టిన రాజకీయాలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. కబీర్‌తో ముస్లిం ఓటు విభజనకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కబీర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిపోవడంతో సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఓటు చీలిపోయే ఆస్కారముంది. ఈ చీలిక నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్‌కు గండికొడుతుంది.
వీరిద్దరూ కలిసి 140 స్థానాల్లో పోటీలో ఉంటారన్న అంచనాలు తృణమూల్‌ను కంగారు పెడుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో హుమయున్ కబీర్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలను బిహార్ రాజకీయాలతో పోల్చుతున్నారు. అక్కడ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటును విభజించి, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. ఆర్‌జేడీ ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇప్పుడు అచ్చం అలాగే హుమాయున్ కబీర్ కారణంగా ముస్లిం ఓటు చీలితే టీఎంసీ విజయావకాశాలు తగ్గి బీజేపీ అధికారపీఠానికి చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


