AI తో హోమ్‌వర్క్‌ సిద్ధం! పరీక్షకు సన్నద్ధం!! | ChatGPT introduces Study Mode | Sakshi
Sakshi News home page

AI తో హోమ్‌వర్క్‌ సిద్ధం! పరీక్షకు సన్నద్ధం!!

Aug 8 2025 5:11 AM | Updated on Aug 8 2025 5:11 AM

ChatGPT introduces Study Mode

‘స్టడీ మోడ్‌’ను పరిచయం చేసిన చాట్‌జీపీటీ  

పోటీలోకి గూగుల్‌ జెమినై ‘గైడెడ్‌ లెర్నింగ్‌’  

విద్యార్థుల భాగస్వామ్యంతో ‘చాట్‌బాట్స్‌’

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: హోమ్‌వర్క్‌లో సాయం చేసే ఓ స్నేహితుడు.. పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో మార్గదర్శనం చేసే టీచర్‌.. ఇదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ గురించే. ఓపెన్  ఏఐకి చెందిన చాట్‌జీపీటీ స్టడీ మోడ్‌ను, గూగుల్‌ జెమినై గైడెడ్‌ లెర్నింగ్‌ టూల్‌ను ప్రారంభించి చాట్‌బాట్‌ను వ్యక్తిగత ట్యూటర్‌గా మార్చేశాయి. 

ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు, అగ్రశ్రేణి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు, ఇంజనీరింగ్, మెడికల్‌ ఎంట్రన్స్ వంటి భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వి ద్యార్థులకు కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్స్‌ మంచి అధ్యయన సహాయకులుగా అవతరిస్తున్నాయి. దీంతో భారత్‌లోని ఎడ్‌టెక్‌ సంస్థలు, సంప్రదాయ కోచింగ్‌ కేంద్రాలు ఏఐ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయని నిపుణులుఅంటున్నారు.

గైడెడ్‌ లెర్నింగ్‌ ఇలా..
అర్థవంతమైన అభ్యాసానికి కేవలం ప్రాంప్టింగ్‌ను (ఆదేశాలు) మెరుగుపరచడం సరిపోదని గూగుల్‌ అంటోంది. విద్యార్థుల ముందున్న సందేహాలు, సమస్యలను దశలవారీగా గైడెడ్‌ లెర్నింగ్‌ విభజిస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వివరణలను మారుస్తుంది. చిత్రాలు, రేఖాచిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్‌ క్విజ్‌లను ఉపయోగించి స్పందిస్తుంది. 

సమాధానం ఇవ్వడం కంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి, పరీక్షించుకోవడానికి యూజర్లకు సహాయపడుతుంది. చురుకైన, నిర్మాణాత్మక ప్రక్రియ అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి బోధనలో భాగస్వామిగా ఉండేలా విద్యావేత్తలతో కలిసి గైడెడ్‌ లెర్నింగ్‌ను రూపొందించినట్టు గూగుల్‌ తెలిపింది.

» ‘హోమ్‌వర్క్‌ హెల్ప్‌’ ద్వారా విద్యార్థుల హోమ్‌వర్క్‌లను.. స్టెప్‌ బై స్టెప్‌ మార్గదర్శనం ద్వారా చేసి పెడుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా దానికి సంబంధించిన చిత్రాలు లేదా డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయడమే.

» అలాగే పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు కూడా ఎలా చదవాలా అనిఆలోచించాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్న నోట్స్, ఇతర డాక్యుమెంట్లుఅప్‌లోడ్‌ చేస్తే చాలు, వాటిని ఒక స్టడీ గైడ్‌గా, ఒక ప్రాక్టీస్‌ టెస్ట్‌గా,పాడ్‌కాస్ట్‌గా కూడా చేసి మన ముందు పెడుతుంది.

» విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలతో విద్యార్థులకుమార్గనిర్దేశం చేయడం ద్వారా వారి సొంత ఆలోచనను అభివృద్ధి చేసుకోవడానికి, మెదడుకు పదును పెట్టడానికి ప్రోత్సహిస్తుందని గూగుల్‌ వివరించింది.

» ఈ విధానాన్ని చేరువ చేయడానికి విద్యావేత్తలు నేరుగా గూగుల్‌క్లాస్‌రూమ్‌లో పోస్ట్‌ చేయగల, విద్యార్థులతో పంచుకోగల ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.

ఇంటర్నెట్‌ వచ్చాక సంప్రదాయ గైడ్స్‌కు కాలం చెల్లింది. సాంకేతికతను ఉపయోగించి ఎడ్‌టెక్‌ కంపెనీలు విద్యావ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడానికి అభ్యాస విధానంలో కొత్తదనం తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏఐ రాకతో తరగతి గదికి మించి నేర్చుకోవడంలో గూగుల్‌ గైడెడ్‌ లెర్నింగ్, ఓపెన్  ఏఐ స్టడీ మోడ్‌ కొత్త రకం అనుభవం అందిస్తాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

‘విద్యార్థులకు లాభదాయకమే’
నిజానికి ఏఐ చాట్‌బాట్‌లు విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష సమాధానాలను ఇచ్చేస్తాయని.. దానివల్ల వారి మెదడుకు పని ఉండదని, దాంతో అభ్యాస ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది విద్యావేత్తలు చెబుతున్నారు. కానీ, అది నిజం కాదంటున్నాయి గూగుల్, ఓపెన్‌ ఏఐ సంస్థలు. ఈ సంస్థలు స్టడీ మోడ్, గైడెడ్‌ లెర్నింగ్‌ పేరుతో వ్యక్తిగత ట్యూటర్లను ప్రవేశపెట్టాయి. ఈ సరికొత్త సాధనాలు చాట్‌బాట్‌లను సాధారణ సమాధాన వేదికలుగా కాకుండా.. అభ్యాస సాధనాలుగా మలచడం ద్వారా విద్యా విధానం కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనపడుతోంది.

ఇదీ ‘స్టడీ మోడ్‌’
దీన్ని కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఓపెన్‌ ఏఐ చెబుతోంది. ఇది కూడా హోమ్‌వర్క్, పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో విద్యార్థులకు సాయం చేస్తుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు స్టడీ మోడ్‌లో చాట్‌ జీపీటీ ప్రత్యక్ష సమాధానాలను అందించదు. విద్యార్థులు వారి లక్ష్యం, జ్ఞాన స్థాయిని బాట్‌కు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమంత తాముగా, చురుకుగా నేర్చుకునేలా, పాఠ్యాంశాలపట్ల లోతైన అవగాహన కలిగేలా హింట్స్, క్విజ్‌ ద్వారా ప్రోత్సహించడం ఇందులోని ప్రత్యేకత. 

ఏదైనా టాపిక్‌ కొత్తదైతే లేదా ఇప్పటికే మెటీరియల్‌పై పట్టు ఉండి తాజా సమాచారం కోరితే.. చాట్‌బాట్‌ వ్యక్తిగతీకరించిన పాఠాన్ని అందిస్తుంది. – విద్యార్థుల కోసం స్టడీ మోడ్‌ సిద్ధం చేయడంలో భాగంగా ఇండియన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల (ఐఐటీ) ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాలను కంపెనీ ఉపయోగించింది. 

» ఐఐటీల వంటి ముఖ్య పరీక్షలతో పాటు భారత్‌లో జరుగుతున్న ఇతర పరీక్షల్లో కూడా పనితీరునుఅంచనా వేయడానికి స్టడీ మోడ్‌ పరీక్షించినట్టు ఓపెన్ ఏఐ తెలిపింది. 

» వాయిస్, ఇమేజ్, టెక్స్‌›్టను సపోర్ట్‌ చేస్తూ 11 భారతీయ భాషల్లో స్టడీ మోడ్‌ అందుబాటులో ఉంది.

కొన్ని సందేహాలు
తమ ఏఐ సేవలను పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు మరింత అందుబాటులో, చవకైన మార్గాల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నామని గూగుల్, ఓపెన్  ఏఐ చెబుతున్నాయి. అయితే వీటిపై విద్యా, వైద్య రంగ నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

» విద్యార్థులు చాట్‌బాట్‌లపై ఎక్కువగా ఆధారపడినప్పుడు వారి విద్యా పరిశోధన నైపుణ్యాలు, పఠన గ్రహణశక్తి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

»  ఫోన్‌ లేదా కంప్యూటర్‌ స్క్రీన్‌ను గంటల తరబడి చూడటం.. కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే చూసే విధానం వల్ల మెడ, వెన్ను వంటి వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement