
21వ సారి నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
వస్తున్నారు, వెళ్తున్నారు.. సాధించింది మాత్రం అప్పులే
ఇటీవల బనకచర్ల విషయంలో బాబుకు కేంద్రం బిగ్‌షాక్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపిందీ లేదు..
పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో నోరు మెదపని సీఎం
మిర్చి రైతులకు మద్దతు ధర, మామిడి రెతులకు తోడ్పాటుపైనా సాధించింది శూన్యం
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ప్రహసనంగా మారుతున్నాయి. 2014–19లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయన తరచూ ఢిల్లీ రావడం.. హడావుడి చేయడం మినహా సాధించిందేమి కనిపించడంలేదు. ‘అయినా పోయి రావలె హస్తినకు’.. అన్నట్లుగా 21వ సారి ఆయన మళ్లీ మంగళవారం ఢిల్లీకి వస్తున్నారు. గడచిన ఏడాది కాలంగా ఏం సాధించారంటే చెప్పుకోవడానికి గొప్పగా ఏమి కనిపించడంలేదు. ప్రతిసారీ రావడం.. కేంద్ర మంత్రులను కలవడం.. రాష్ట్ర అభివృద్ధే తన అజెండా అని చెప్పడం పరిపాటిగా మారింది. ప్రధాని సహా, కేంద్ర మంత్రులను కలిస్తే వారితో చర్చించిన అంశాలను ఎంపిక చుకున్నాడు మీడియాకు మాత్రమే వివరిస్తున్నారు. తాజాగా.. మంగళవారం మళ్లీ చంద్రబాబు ఢిల్లీకి వస్తుండగా, ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులను కలవనున్నారు.
వస్తున్నారు.. వెళ్తున్నారు..
ఎన్‌డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు 21సార్లు ఢిల్లీకి వచ్చి ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. వీరిని కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించానని, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధానిని తాను నిరి్మంచబోతున్నట్లు ఎంపిక చేసుకున్న మీడియాకు చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే అప్పులు తప్ప ఆయన సాధించింది ఏమీ కనపడటంలేదు. ఇప్పటివరకు అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15వేల కోట్లు పొందారు. ఇవి కాక.. బడ్జెటేతర అప్పులు ఇప్పటివరకు రూ.19,410 కోట్లు. ఇక ప్రతి మంగళవారం అప్పులు సరేసరి.
విశాఖ స్టీల్‌ప్లాంట్, పోలవరంపై గప్‌చుప్..
మరోవైపు.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దని ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఎన్‌డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు దీనిని ప్రైవేటీకరణ చేయడంలేదనే హామీని మాత్రం కేంద్రం నుంచి ఇప్పించలేకపోతున్నారు. అలాగే, పోలవరం ఎత్తు తగ్గించినట్లు లోక్‌సభ సాక్షిగా బట్టబయలైనా ఆయన నోరు మెదపడంలేదు. ఎత్తు తగ్గలేదని బుకాయించే పనిలో మాత్రం ఎన్‌డీఏ నేతలు నిమగ్నమయ్యారు. ఈ అంశంపై మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
బనకచర్లపై బిగ్‌షాక్..
ఇదిలా ఉంటే.. కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్‌డీఏ బిగ్‌షాక్ ఇచ్చింది. సముద్రంలో వృధాగా పోయే గోదావరి జలాలను వాడుకునేందుకు ‘పోలవరం–బనకచర్ల’ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉందని, త్వరలో డీపీఆర్ సమర్పించనుందని ఇటీవల ఢిల్లీ వచి్చన సమయంలో మీడియాకు చెప్పారు. అయితే, కొద్దిరోజులకే ఈ ప్రతిపాదనలను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) వెనక్కు పంపింది. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి.. పర్యావరణ ప్రభావ అంచనాపై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చింది.
గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)తో సమగ్రంగా అధ్యయనం చేయించి లెక్క తేల్చాలని సిఫార్సు చేసింది. దీంతో.. బనకచర్లపై ఊదరగొట్టిన చంద్రబాబుకు ఇదొక బిగ్‌షాక్ అనే చెప్పాలి. ఇక మిర్చి రైతులకు మద్దతు ధర విషయంలోగానీ.. తోతాపురి మామిడి రైతులను ఆదుకునే విషయంలోగానీ కేంద్రం నుంచి ఆయనేమీ సాధించలేకపోయారు.