త్విషా శర్మ మృతి కేసు రిటైర్డ్‌ జడ్జి గిరిబాల అరెస్ట్‌  | CBI arrests Giribala Singh in Twisha Sharma death case | Sakshi
Sakshi News home page

త్విషా శర్మ మృతి కేసు రిటైర్డ్‌ జడ్జి గిరిబాల అరెస్ట్‌ 

May 29 2026 1:03 AM | Updated on May 29 2026 1:03 AM

CBI arrests Giribala Singh in Twisha Sharma death case

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నటి, మాజీ మోడల్‌ త్విషా శర్మ(33)కేసు మరో మలుపు తిరిగింది. ఆమె అత్త, రిటైర్డ్‌ జిల్లా జడ్జి అయిన గిరిబాలా సింగ్‌ను ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ గురువారం అరెస్ట్‌ చేసింది. అంతకుముందు, మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈ కేసులో దిగువ కోర్టు ఆమెకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. 

ముగ్గురు అధికారులతో కూడిన సీబీఐ బృందం దర్యాప్తులో భాగంగా ఉదయం 10.30 గంటల సమయంలో గిరిబాలా సింగ్‌ను ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ బృందం ఈ సందర్భంగా ఆమె ఇంటి డిజిటల్‌ మ్యాపింగ్‌ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తునకు భోపాల్‌లో ప్రత్యేక కార్యాలయానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ను కోరినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. 

ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం 
త్విషా శర్మ మృతి కేసులో వివిధ ఘటనల క్రమం, గిరిబాలా సింగ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు బుధవారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు తెలిపింది. కట్నం వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న గిరిబాలా సింగ్, ఆమె కుమారుడు సమర్థ్‌ సింగ్‌లకు ఈ నెల 15వ తేదీన భోపాల్‌లోని సెషన్స్‌ కోర్టు బెయిలిచ్చింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బుధవారం సీబీఐ తరఫున కోర్టులో పిటిషన్‌ వేశారు. 

త్విషా అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్‌ సింగ్‌లకు ముందస్తు బెయిల్‌ మంజూరు విషయంలో దిగువ కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం అర్థమవుతోందంటూ పేర్కొన్నారు. అత్తింటి వారు త్విషాను సంతోషంగా ఉండేందుకు, కనీసం బాధపడేందుకు సైతం అవకాశమివ్వలేదన్నారు. 

ముందస్తు బెయిల్‌ పొందిన గిరి బాలాసింగ్‌ 18వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్విషా శర్మపై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించారని తెలిపారు. గిరిబాలా సింగ్‌ తన పలుకుబడిని ఉపయోగించుకుని ఘటనా స్థలంలో ఆధారాలను తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో సాక్ష్యాధారాలను సరిగ్గా పరిశీలించాల్సిన బాధ్యత ట్రయల్‌ కోర్టుపై ఉన్నందున, ఆమెకు ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement