బీజేపీ అంత సాహసం చేస్తుందా? | Can Mamata Save TMC From Collapse Amid BJP Surge | Sakshi
Sakshi News home page

బీజేపీ అంత సాహసం చేస్తుందా?

Jun 2 2026 7:20 AM | Updated on Jun 2 2026 8:36 AM

Can Mamata Save TMC From Collapse Amid BJP Surge

ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. ఇప్పుడు తన అస్తిత్వానికే పోరాడుతోందా? వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలు, వేటులు, పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీ ప్రభావం.. ఈ పరిణామాలన్నీ టీఎంసీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడగలిగేది మమతా బెనర్జీ ఒక్కరేనా? లేదంటే టీఎంసీ ఆమె చేతుల్లో నుంచి కూడా జారిపోతుందా? అనే చర్చ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాల్లో 208 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. దాదాపు పదిహేనేళ్ల అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫలితాల తర్వాతే టీఎంసీలో అసంతృప్తి బయటపడటం మొదలైంది. ఇటీవల మమతా నిర్వహించిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది హాజరుకాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది.

బహిరంగంగానే అంగీకారం
పార్టీలో చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌లో అంగీకరించారు. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “నాయకులు భయపడవచ్చు.. కానీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలు ఉన్నంతకాలం నేను పార్టీని మళ్లీ నిర్మిస్తా” అని ఆమె ప్రకటించారు.

అభిషేక్‌పై అసంతృప్తి?
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై కూడా టీఎంసీ సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు అధిక ప్రాధాన్యం కల్పించడం వల్ల మధ్యస్థాయి నాయకత్వం పార్టీకి దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఎన్నికల ఓటమికి ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని కూడా ఆరోపిస్తున్నారు.

పార్టీ నుంచి నిష్క్రమణల పరంపర
ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్‌, సీనియర్ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి కూడా పదవులు వీడారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, అసోం యూనిట్ మాజీ అధ్యక్షుడు అభిజిత్ మజుందార్ వంటి ప్రముఖులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టారు. మరోవైపు వందకు పైగా కార్పొరేటర్లు కూడా టీఎంసీకి రాజీనామా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఎందుకు దూరమవుతున్నారు?
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఎంసీలో సిద్ధాంతపరమైన బలం ఎప్పటినుంచో బలహీనంగానే ఉంది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను గెలుపు అవకాశాల కోసం పార్టీలోకి తీసుకువచ్చారు. వారు మమతా ఇమేజ్‌, టీఎంసీ బలంతో గెలిచినా.. పార్టీతో భావోద్వేగ అనుబంధం లేదంటే సిద్ధాంతపరమైన నిబద్ధత మాత్రం ఎక్కువగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతకడం సహజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీజేపీ అంత సాహసం చేస్తుందా?
టీఎంసీ నేతల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆశ్రయాల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో ఉండటం రాజకీయంగా లాభదాయకమని భావిస్తున్న నేతలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే టీఎంసీ నుంచి వచ్చే ప్రతి నేతకు బీజేపీ తలుపులు తెరుస్తుందా? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. 2021 ఎన్నికల సమయంలో టీఎంసీ నుంచి భారీగా వచ్చిన నేతలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పాత బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరగడంతో పాటు, టీఎంసీ నుంచి వచ్చిన వారిని ప్రజలు పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

అంతేకాకుండా అవినీతి, స్థానిక వివాదాలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మాజీ టీఎంసీ నేతలను చేర్చుకోవడం వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కేవలం సంఖ్యాబలం కోసం కాకుండా.. పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే, ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న నాయకుల విషయంలో మాత్రమే బీజేపీ ఆసక్తి చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు టీఎంసీ నుంచి బయటకు రావాలనుకునే నేతలకు కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ఆహ్వానం కనిపించడం లేదు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న నేతలు కూడా కొంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం టీఎంసీలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది వెంటనే బీజేపీలో భారీ చేరికలుగా మారుతుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేని అంశంగానే మిగిలింది.

టీఎంసీకి మమతే బలం.. అదే బలహీనత
టీఎంసీ అంటే మమతా.. మమతా అంటే టీఎంసీ అన్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగింది. అదే ఇప్పుడు పార్టీకి బలం కూడా, బలహీనత కూడా అయింది. ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించకపోవడం ఒకవైపు సానుకూల అంశమైతే.. మొత్తం పార్టీ ఒకే వ్యక్తిపై ఆధారపడటం మరోవైపు ప్రమాద సంకేతంగా మారింది. ప్రస్తుతం మమతా లేకుండా టీఎంసీని ఊహించడం కష్టమే. కానీ మమతా ఒక్కరే పార్టీని మళ్లీ గాడిలో పెట్టగలరా? అనే ప్రశ్న మాత్రం మరింత బలంగా వినిపిస్తోంది.

అసలైన పరీక్ష ఇప్పుడే
బెంగాల్ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి అధికారాన్ని కోల్పోయిన పార్టీ మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు. కాంగ్రెస్‌, సీపీఎం వంటి దిగ్గజాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు టీఎంసీ కూడా అలాంటి మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం మమతా బెనర్జీకి రెండు సవాళ్లు ఒకేసారి ఎదురయ్యాయి. బయట బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుండగా.. లోపల పార్టీ చీలికల ముప్పు వెంటాడుతోంది. 2029 లోక్‌సభ, 2031 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని కాపాడటం, మళ్లీ కార్యకర్తల్లో నమ్మకం నింపడం ఆమె ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement