రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి

Breakthrough as govt accepts two demands of farmers - Sakshi

రైతుల ప్రధాన డిమాండ్లలో రెండింటికి ప్రభుత్వం అంగీకారం

సాగు చట్టాల రద్దు, ఎమ్మెస్పీ చట్టబద్ధత  డిమాండ్లపై ప్రతిష్టంభన

జనవరి 4న మరో విడత చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్‌ బిల్లుల భారం పెంచే విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

నరేంద్ర సింగ్‌ తోమర్, పియూష్‌ గోయల్, సోం ప్రకాశ్‌ సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులైన 40 రైతు సంఘాల నేతలతో బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మధ్యాహ్నం 2 నుంచి దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. ఇర వర్గాల మధ్య ఇవి ఆరో విడత చర్చలు. 50% అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని చర్చల అనంతరం తోమర్‌ వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై వచ్చే సంవత్సరం జనవరి 4న చర్చిస్తామన్నారు. ‘చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. రెండు అంశాలపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలు, ఎమ్మెస్పీపై చర్చలు జనవరి 4న కొనసాగుతాయి’ అన్నారు. రైతు నేతలు కొత్త సాగు చట్టాల రద్దుకు పట్టుపట్టారని, అయితే, చట్టాల వల్ల ప్రయోజనాలను వారికి వివరించామని తెలిపారు. చట్టాలకు సంబంధించి తమ అభ్యంతరాలను నిర్దిష్టంగా తెలపాలని కోరామన్నారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న వేలాది రైతులపై తోమర్‌ ప్రశంసలు కురిపించారు. వారు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలుపుతున్నారన్నారు. చలి తీవ్రమవుతున్న దృష్ట్యా.. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలను ఇళ్లకు  పంపించాలని కోరారు. విద్యుత్‌ చార్జీలు, పంట వ్యర్థాల దహనంపైనే బుధవారం నాటి చర్చలు ప్రధానంగా జరిగాయని రైతు నేత కల్వంత్‌ సింగ్‌ సంధు వెల్లడించారు. చర్చల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సానుకూలంగా ఉందని రైతు నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెస్పీని సమర్ధవంతంగా అమలు చేసేందుకు నిపుణులతో కమిటీ వేస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించామని పంజాబ్‌ కిసాన్‌ యూనియన్‌ నేత రుల్దు సింగ్‌ మాన్సా వెల్లడించారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కు తీసుకుంటామని, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు శిక్ష విధించే నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఆర్డినెన్స్‌లో సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.  

ప్రభుత్వ ప్రతిపాదనలపై 2న రైతుల చర్చ
కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత వరి సహా పలు పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువకే అమ్మాలని రైతులపై ఒత్తిడి చేస్తున్నారని రైతు నేతలు బుధవారం తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్‌లో పంటల మార్కెట్‌ ధరలు 50శాతానికిపైగా పడిపోయాయి. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకే అమ్మాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. వరి క్వింటాల్‌కు రూ. 800లకు అమ్మాల్సి వస్తోంది. ఈ విషయాలను చర్చల్లో లేవనెత్తుతాం’ అని చర్చలు ప్రారంభమయ్యే ముందు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ వివరించారు. ‘మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేవరకు ఉద్యమం కొనసాగుతుంది. నూతన సంవత్సర వేడుకలను కూడా ఇక్కడే జరుపుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై జనవరి 2వ తేదీన రైతు సంఘాల ప్రతినిధులు సింఘు సరిహద్దు వద్ద అంతర్గత చర్చలు జరుపుతారని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేత హన్నన్‌ మొల్లా వెల్లడించారు.

రైతులతో కలిసి భోజనం
ఆరో విడత చర్చల సందర్భంగా రైతు నేతల కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్నే కేంద్ర మంత్రులు సైతం భుజించారు. చర్చలు ప్రారంభమైన రెండు గంటల తరువాత రైతు నేతలకు నిరసన కేంద్రంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్‌ నుంచి ఒక వ్యాన్‌లో భోజనం వచ్చింది. అదే ఆహారాన్ని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు తోమర్, గోయల్, సోమ్‌ ప్రకాశ్‌ కూడా స్వీకరించారు. సాయంత్రం ప్రభుత్వం ఆఫర్‌ చేసిన టీ, స్నాక్స్‌ను రైతు నేతలు తీసుకున్నారు. గత చర్చల సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని రైతు నేతలు తిరస్కరించి, తమ కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన ఆహారాన్నే స్వీకరించిన విషయం తెలిసిందే.  

రెండు కమిటీలు

 రైతుల అభ్యంతరాలపై నిపుణులతో రెండు కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రతిపాదన. కనీస మద్దతు ధరకు, మార్కెట్‌ ధరకు మధ్య అసమానతలను తొలగించేందుకు ఒక కమిటీని, వ్యవసాయ చట్టాలపై రైతులు వెలిబుచ్చుతున్న అభ్యంతరాలను తొలగించేందుకు, చట్టాల్లో సవరణలను సూచించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలను రైతు నేతలు తోసిపుచ్చారు.

వాయిదా
చర్చల్లో పురోగతి నేపథ్యంలో నేడు తలపెట్టిన ట్రాక్టర్‌ మార్చ్‌ను వాయిదా వేసుకున్న రైతు సంఘాలు.  

మోదీది ‘అసత్యాగ్రహ’ చరిత్ర

ప్రధాని మోదీపై రైతులు విశ్వాసం కోల్పోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ తన ‘అసత్యాగ్రహ’ చరిత్ర వల్ల దేశ ప్రజల నమ్మకం కోల్పోయారన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలను మోదీ ఎందుకు రద్దు చేయడం లేదనే అంశంపై జరిగిన ఆన్‌లైన్‌ సర్వేను రాహుల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ప్రతీ పౌరుడి బ్యాంక్‌ ఖాతాలో రూ. 15 లక్షలు’, ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు’, ‘50 రోజుల సమయమివ్వండి’, ‘కరోనాపై 21 రోజుల్లో విజయం సాధిస్తాం’, ‘మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. చైనా మన పోస్ట్‌లను ఆక్రమించలేదు’.. ఇలాంటి ‘అసత్యాగ్రహ’ చరిత్ర కారణంగా రైతులు ప్రధాని మోదీని నమ్మడం లేదని రాహుల్‌ పేర్కొన్నారు.  


చర్చల వేళ విజ్ఞాన్‌ భవన్‌లో భోజనం చేస్తున్న రైతు ప్రతినిధులు

సింఘు సరిహద్దు వద్ద మువ్వన్నెల జెండాతో రైతు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top