Blackday: రైతు సంఘాల దీక్ష.. ఢిల్లీలో అలర్ట్​

Black Day On Farmers Protest Completed 6 Months Farm Laws - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తైంది. కేంద్ర ప్రభుత్వం కిందటి ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నవంబర్​ 26 తేదీ నుంచి రైతు సంఘాలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ బ్లాక్​ డే నిర్వహించాలని సంఘాలు నిర్ణయించుకున్నాయి కూడా. దీంతో దేశ రాజధానికి నలువైపులా భారీగా పోలీసులు మోహరించారు.  

మొద్దు ప్రభుత్వం
బ్లాక్‌డే సందర్భంగా రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఉద్యమం చేయబట్టి ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలలు దేశ జెండాను మోశాం. మా గళం వినిపించాం. కానీ, ఎవరూ స్పందించలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం మొద్దుగా వ్యవహరిస్తోంది’’ అని టికాయత్ మండిపడ్డాడు. నిరసనల సందర్భంగా ఎక్కడా గుంపులుగా చేరబోమని, బహిరంగ సమావేశాలు అసలే నిర్వహించమని ఆయన స్పష్టం చేశాడు. అయితే రైతులు మాత్రం ఎక్కడికక్కడే నల్ల జెండాల్ని ఎగరేసి నిరసన తెలపాలని టికాయత్ ఒక ప్రకటనలో​ పిలుపు ఇచ్చాడు.

ఊరుకునేది లేదు
రైతుల బ్లాక్ డే నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో  లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఢిల్లీలో కరోనా విజృంభణ, లాక్​డౌన్​ అమలులో ఉన్నందున ఎవరైనా గుంపులుగా మీటింగ్​లు పెట్టినా, అక్రమంగా చెక్​పాయింట్ల నుండి చొరబడేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో చిన్మయ్​ బిస్వాల్ తెలిపారు.

శాంతియుతంగా..
మరోవైపు నేడు బుధ పూర్ణిమ కావడంతో శాంతియుతంగా బ్లాక్​డే నిర్వహించాలని కిసాన్​ సంయుక్త మోర్చా పిలుపు ఇచ్చింది. సమాజంలో సత్యం, అహింస జాడ కరవైందని.. వాటిని పునరుద్ధరించేలా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే ఎక్కడికక్కడ శాంతియుతంగా బ్లాక్​డే నిరసన తెలపాలని రైతులను కోరింది. ఈ నేపథ్యంలో ఇళ్లపైనే నల్లజెండాలు ఎగరేస్తూ రైతులు నిరసన తెలియజేస్తున్నారు. 

మద్ధతుగా ప్రతిపక్షాలు..
మే 26న బ్లాక్ డే నిర్వహించాలని వారం క్రితమే ఎస్​కేఎం నిర్ణయించింది. ఈ నిరసనలకు తమ మద్ధతు ఉంటుందని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈమేరకు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక బ్లాక్​డేకు మద్దతుగా కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలాలో, ఆయన కూతురు రబియా అమృత్​సర్​లో ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.

సర్కార్​లకు నోటీసులు
మరోవైపు, కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుండడంపై ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై  నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top