పుదుచ్చేరిలో హోరాహోరీ  | BJP-AINRC seat-sharing finalised in Puducherry | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో హోరాహోరీ 

Mar 24 2026 5:04 AM | Updated on Mar 24 2026 6:23 AM

BJP-AINRC seat-sharing finalised in Puducherry

మరో విజయంపై ఎన్డీఏ ధీమా

డీఎంకే కూటమిలో సీట్ల లొల్లి

బరిలో విజయ్‌ పార్టీ

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం మరోసారి ప్రజాతీర్పు కోరడానికి సిద్ధమైంది. ఆయన సారథ్యంలోని ఆలిండియా ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌సీ), బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమాగా ఉంది. విపక్ష డీఎంకే, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తుండగా సినీ నటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరు మరోసారి కలిసొస్తుందని ఎన్డీఏ ఆశిస్తోంది. 

కూటమి భాగస్వామి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం, పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులివ్వడాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తోంది. డీఎంకే, కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. హామీలు నెరవేర్చలేదని, శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపిస్తున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ బలపడటంపై బీజేపీ కన్నేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు పుదుచ్చేరిలో ఇప్పటికే పలుమార్లు విస్తృతంగా పర్యటించారు. 

విజయ్‌ పార్టీతో చేటెవరికి? 
అంతర్గత కలహాలు, సీట్లపై సిగపట్లు డీఎంకే కూటమిని కలవరపెడుతున్నాయి. పుదుచ్చేరిలో ఒకప్పుడు ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం డీఎంకేకు జూనియర్‌ భాగస్వామిగా మారిపోయింది. అలాగని డీఎంకే 20 సీట్లకు పట్టుబడుతుండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసినా సీట్ల పంపకంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దాంతో పలు అసెంబ్లీ స్థానాలకు డీఎంకే, కాంగ్రెస్‌ అభ్యర్థులిద్దరూ నామినేషన్లు వేశారు. ఇది వాటి మధ్య స్నేహపూర్వక పోటీలకు దారి తీస్తే కూటమి విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. విజయ్‌ పార్టీ టీవీకే పోటీలో ఉండటం తమకే లాభమని అధికార, విపక్ష కూటములు రెండూ లెక్కలేసుకుంటున్నాయి. తమిళ జాతీయవాది సీమాన్‌ నాయకత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ మూడో స్థానం దక్కించుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.  

ఎన్డీఏ కూటమి 
సానుకూలతలు 
→ సీఎం రంగస్వామి ప్రజాదరణ 
→ ప్రధాని మోదీ కరిష్మా 
→ కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి పనులు 
→ డీఎంకే కూటమి అనైక్యత 

ప్రతికూలతలు 
→ ప్రభుత్వ వ్యతిరేకత 
→ మంత్రులపై అవినీతి ఆరోపణలు 
→ విజయ్‌ పార్టీతో ఓటుబ్యాంకుకు గండి పడే ఆస్కారం

డీఎంకే కూటమి 
సానుకూలతలు 
→ రంగస్వామి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత
→ డీఎంకే ద్రవిడ జాతీయవాద నినాదం 
→ పలు జనాకర్షక పథకాల హామీలు

ప్రతికూలతలు 
→ సీట్ల సర్దుబాటుపై ఎడతెగని సిగపట్లు 
→ పలు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులను బరిలో దింపడం

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement