బిలాస్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు నేడు(బుధవారం) తెలిపారు. మంగళవారం ఒక గూడ్స్ రైలు.. మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (మెము)ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారంగా ప్రకటించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మెము(ప్యాసింజర్ రైలు) కోర్బా జిల్లాలోని గెవ్రా నుండి బిలాస్‌పూర్‌కు వెళుతూ ఒక గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ఘటన ఆగ్నేయ మధ్య రైల్వే (ఎస్‌ఈసీఆర్) జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న బిలాస్‌పూర్ నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలు కోచ్.. కార్గో రైలు వ్యాగన్ పైన పడిపోయిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులు.. మొత్తం ఎనిమిది మృతదేహాలను వెలికితీశారని ఇన్‌స్పెక్టర్ జనరల్ (బిలాస్‌పూర్ రేంజ్) సంజీవ్ శుక్లా తెలిపారని ‘హిందుస్తాన్ టైమ్స్’ పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలు పూర్తిగా తొలగించాక మరణాల సంఖ్య ఎంత అనేది తెలిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. బిలాస్‌పూర్ కలెక్టర్ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, గాయపడిన ప్రయాణికులను బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రి, ఛత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)కు తరలించామన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.



