ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. చనిపోయిన వైద్యురాలు.. దీపాలీ మారుతీ అనే మహిళ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై దర్యాప్తు చేయాలని ఆమె తల్లి భాగ్యశ్రీ డిమాండ్ చేశారు.
కాగా, మహారాష్ట్ర ఓ వైద్యురాలు.. ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనపై లైంగిక దాడి చేశారని.. మానసిక, శారీరక వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. అలాగే, తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నాయకులు వైద్య నివేదికలు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. దీంతో, ఆమె ఇచ్చిన రిపోర్టులకు సంబంధించి.. పాత కేసుల దర్యాప్తు విషయంలో సందేహాలు ఉన్నట్టు తాజాగా ఓ మహిళ అనుమానాలు వ్యక్తం చేశారు.
తాజాగా సతారాకు చెందిన భాగ్యశ్రీ పచాంగ్నే.. తన కుమార్తె దీపాలీ మారుతీ మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలే రిపోర్ట్ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భాగ్యశ్రీ పచాంగ్నే కుమార్తె దీపాలి మారుతిని సైన్యంలో పని చేస్తున్న అజింక్య హన్మంత్ నింబాల్కర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి అత్త గారింట్లో దీపాలి.. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. అనంతరం, ఆగస్టు 19న దీపాలి మారుతి చనిపోయింది. అల్లుడు ఫోన్ చేసి దీపాలి పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తల్లికి తెలియజేశాడు. గర్భవతి కాబట్టి మూర్ఛపోయి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ భావించింది. కానీ, ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికి దీపాలి చనిపోయి ఉండటం చూసి ఆవేదనకు గురైంది.
అయితే, దీపాలి ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరు తల్లికి తెలిపారు. కానీ, భాగ్యశ్రీ మాత్రం దీపాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు.. దీపాలి మరణం తర్వాత పోస్ట్‌మార్టం జరిగి ఐదు రోజులైనా నివేదిక ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత నివేదిక వచ్చింది. తీరా ఆ నివేదికలో సహజ మరణం అని రావడంతో భాగ్యశ్రీ ఖంగుతిన్నది. ఆ నివేదికపై తల్లి స్పందిస్తూ.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. దీపాలిని భర్త, అత్తమామలు చంపేశారని నమ్ముతున్నాను. ఆమె ఆరు నెలల గర్భవతి. ఏడాదిన్నర కుమార్తె కూడా ఉంది. నా కుమార్తె ఆత్మహత్య చేసుకోదు అని తెలిపారు. అనంతరం, దీపాలి మృతిపై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు.


