పశ్చిమబెంగాల్‌లో రికార్డులు బద్దలయ్యాయి. స్వాత్యంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్ శాతం జరిగిన ఎన్నికలుగా పశ్చిమబెంగాల్ ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానే వచ్చాయి.
చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్
టీఎంసీ-130-140
బీజేపీ- 150-160
కాంగ్రెస్2-4
పీమార్క్ ఎగ్జిట్ పోల్స్
TMC 118-138
BJP 150-175
CONG 2-6
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ సర్వే పూర్తి వివరాలు
రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు.అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం,ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది
ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాయ్గురి డివిజన్లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ డివిజన్లో బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్లో బలహీనంగా ఉంది. ఇక్కడ దళితులు, గుర్ఖాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది..
మైనార్టీలు అధికంగా ఉండే మాల్దా డివిజన్లో టీఎంసీ తన బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశాలున్నాయని ప్రెసిడెన్సీ డివిజన్లో మరోసారి టీఎంసీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని సర్వేలో తేలింది. కోల్‌కతా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీపై టీఎంసీ పై చేయి సాధించినట్లు సర్వేలో వెల్లడైంది.
సామాజిక వర్గాలుగా పరిశీలిస్తే దళితులు, ముస్లింలు టీఎంసీ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ, బీజేపీ మధ్య చీలిపోయారు. మాతూస్ సామాజిక వర్గం ‘సర్’ పై ఆగ్రహంతో బీజేపీకి దూరమయ్యారు. ముస్లిం సామాజిక వర్గంలో ఎలాంటి చీలిక కనిపించకపోవడం టీఎంసీకి కలిసి వచ్చింది. ఏఐఎంఐఎం, జేయూపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముస్లిం ఓట్లమై ఆశలు పెట్టుకున్నా వారు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకే మూకుమ్మడిగా ఓటు వేశారు.అని సర్వే చెబుతోంది.
రాష్ట్రంలో 35 శాతంపైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా, 25 శాతంపైగా ముస్లింలున్న స్థానాలను కలుపుకుంటే మొత్తం 112 స్థానాల్లో ముస్లింలు కీలకంగా ఉన్నారు.
‘సర్’ తో 90 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ఓటు హక్కు పోయిందని, తర్వాత రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో నెలకొందని సర్వేలో తేలింది.
టీఎంసీ ప్రవేశపెట్టిన లక్కీ భండార్ పథకంతో మహిళలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ జాతీయ వాదంపై మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీకి సరితూగే నేతలు ఏ పార్టీలో లేకపోవడం టీఎంసీకి కలిసివచ్చింది. బీజేపీ నేత సువేందు అధికారి కీలకపాత్ర పోషించినా మమతా బెనర్జీకి సరితూగలేదు. కాంగ్రెస్, వామపక్షాల నుండి ఆమెకు సమానంగా ఏవరూ లేరు.
కాగా స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ ప్రజలకు సహనం, ఓర్పు ఎక్కువని స్పష్టమవుతోంది. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్ల పాటు అధికారం కట్టబెడితే, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు. ఆ ఒరవడిలోనే టీఎంసీకి నాలుగో దఫా కూడా అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి.
బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం లేకపోవడం ప్రతికూలంగా మారింది. కాగా ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే చాలా సార్లు ఇవి తారుమారైన సందర్బాలున్నాయి. వాస్తవిక ఫలితాలు మే 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది.



