అంచనాలు నిజమయ్యేనా? | Axis My India Exit Poll Predicts Major Win For Vijay TVK In Tamil Nadu 2026, Sparks Political Buzz And Debate | Sakshi
Sakshi News home page

అంచనాలు నిజమయ్యేనా?

May 2 2026 7:57 AM | Updated on May 2 2026 11:40 AM

axis my india exit poll vijay tvk tamil nadu majority prediction

సాక్షి, చెన్నై: అధికారం తమదే, విజయ్‌ సీఎం కావడం తథ్యమని ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రకటించిన యాక్సిస్‌ మై ఇండియా గత అంచనాలు నిజమయ్యాయా అనే కోణంలో టీవీకే వర్గాలు అన్వేషణలో నిమగ్నమ్యాయి. మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకే కూటమికే మళ్లీ పట్టం అని ప్రకటిస్తే, యాక్సిస్‌మై ఇండియా మాత్రం విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు స్పష్టమైన విజయ అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం టీవీకే వర్గాల్లో జోష్‌ను నింపింది. 

 తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. యాక్సిస్‌ మై ఇండియా అంచనా ప్రకారం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పారీ్టగా లేదా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంతవరకు నిజమయ్యాయి?, ఏయే ఎన్నికల్లో వీరి అంచనాలు తప్పాయో అనే అంశంపై టీవీకే వర్గాలు సమీక్షించే పనిలో నిమగ్నం కావడం విశేషం.

నిజమైన సందర్భాలెన్నో  
యాక్సిస్‌ మై ఇండియా గతంలో నిర్వహించిన పలు సర్వేలు ఎన్నికల ఫలితాలను చాలా ఖచ్చితంగా అంచనా వేశాయన్న చర్చ జరుగుతోంది. ఆ మేరకు 2019 లోక్‌సభ ఎన్నికలలో  ఎన్‌డీఏ కూటమి 339 నుంచి 365 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసిందని చెప్పవచ్చు. ఇందులో  353 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం గమనార్హం.  2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ  76 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పి ఓటరు నాడిని స్పష్టంగా ముందే గ్రహించారని చెప్పవచ్చు. 

ఈ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పగా.. యాక్సిస్‌ మై ఇండియా మాత్రం బీజేపీ 140 నుంచి 162 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఫలితం బీజేపీ వైపు ఉండడం గమనార్హం. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ కూటమి 178 నుంచి 200 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా, ఈ కూటమి 235 స్థానాలలో విజయంతో అధికారం కైవశం చేసుకుంది.  2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఉంటుందని ఇతర సర్వేలు చెప్పగా.. యాక్సిస్‌ మై ఇండియా మాత్రం బీజేపీ 45 నుంచి 55 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇందుక అనుగుణంగా బీజేపీ 48 స్థానాలలో విజయం సాధించడం గమనార్హం. అదే సమయంలో అంచనాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డీఏ కూటమి 360 నుంచి 390 సీట్లు వస్తాయని అంచనా వేయడం ఫలితం 293 సీట్ల వద్దే ఆగింది. 

ఇప్పుడు తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిగతా సర్వేలకు భిన్నంగా విజయ్‌ టీవీకే పారీ్టకి 98–120 సీట్లు వస్తాయని యాక్సిస్‌ మై ఇండియా అంచనా వేసింది. ఈ అంచనా నిజమై విజయ్‌ సరికొత్త చరిత్ర çసృష్టిస్తారా అనే  ఎదురు చూపులలో టీవీకే వర్గాలు, అభిమానులు ఉన్నారు. ఈసర్వేనే కాదు, సామాజిక మాధ్యమాలలో సాగుతున్న సర్వేలన్నీ విజయ్‌కు అనుకూలంగా ఉండడంతో తుది తీర్పు మే 4వ తేదీ కోసం వేచి చూడక తప్పలేదు. ప్రజా మద్దతకు దైవబలం సైతం తోడు కావాలన్న కాంక్షతో విజయ్‌ తాజాగా ఆధ్యాతి్మక యాత్రలో ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం విజయ్‌ నాగపట్నం జిల్లాలో వేలాంకన్ని మాత ఆలయం, నాగూర్‌ దర్గాను సందర్శించేందుకు సిద్ధం కావడం విశేషం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement