విజయ్‘భేరి’ ఖాయం
యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్
చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. బ్లాక్‌బస్టర్ సినిమాలతో సినీప్రియులను ఉర్రూతలూగించిన హీరో విజయ్ ఇకపై ముఖ్యమంత్రిగా తమిళనాడు పౌరులనూ పాలించబోతున్నారని బుధవారం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది.
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఛైర్‌పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్‌లా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌లా విజయ్ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది.
అరంగేట్రం అదిరేలా..
స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ సాధారణ మెజార్టీ కంటే తక్కువగా 92 నుంచి 110 స్థానాలకు పరిమితంకావొచ్చు. ఎన్‌డీఏ కూటమి 22 నుంచి 32 సీట్లు సాధించొచ్చు. టీవీకే మాత్రం విజయదుందుభి మోగించే వీలుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం...ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 35 శాతం ఓట్లు సాధించనుంది. టీవీకే సైతం 35 శాతం ఓట్లు సాధించనుంది. అయితే సీట్లపరంగా చూస్తే డీఎంకే కంటే టీవీకే ఎక్కువ సీట్లను గెల్చుకోనుంది. అన్నాడీఎంకే 23 శాతం ఓట్లు సాధించి 22 నుంచి 32 చోట్ల గెలిచే ఆస్కారముంది.
యువ ఓటర్ల ఓట్లే కీలకం..
ఎగ్జిట్ పోల్ గణాంకాల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉంది.
→ 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగాఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారు
→ 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్‌కే తమ మద్దతు అని వెల్లడించారు
→ 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని తెలిపారు
→ విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతులేకపోవడం విశేషం
మార్పు... అసలైన మంత్రం
పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35 శాతం మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్లామని 77 శాతం మంది ఆయన మద్దతుదారులు తెలిపారు. కేవలం విజయ్ హుందాతనం, ఛరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెప్పారు. కొత్తతరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్‌కి కలిసిరావొచ్చని ఎగ్జిట్ పోల్ పేర్కొంది.
కులాలు, మతాలకతీతంగా..
కులాలు, మతాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ్‌కు ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. ఓబీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, గ్రామీణ,పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ టీవీకేకు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్‌పోల్ విశ్లేషించింది. ఉపకులాల వారీగా చూసినా ఇతర పార్టీలతో పోలిస్తే విజయ్‌కు మద్దతు ఎక్కువగా కన్పించింది. ప్రచారకాలంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే విజయ్‌కు హవా ఉన్నట్లు ప్రచారసభలకు వచ్చిన జనాలను బట్టి తెలుస్తోంది. తీరా పోలింగ్ సమయం సమీపించేనాటికి టీవీకే పట్ల అభిమానం అంతకంతకూ పల్లెలకూపాకిందని ఎగ్జిట్‌పోల్ తెలిపింది.
ముఖ్యమంత్రిగానూ..
రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ సీఎం కావొచ్చని 37 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సీఎం కావొచ్చని 35 శాతం మంది అంచనావేశారు. తొలి ఎన్నికల్లోనే ప్రస్తుత సీఎంకు గట్టిపోటీ ఇచ్చేస్థాయికి విజయ్‌కు ప్రజాదరణ దక్కడం విశేషమని యాక్సిస్ మై ఇండియా ఛైర్‌పర్సన్ ప్రదీప్ గుప్తా చెప్పారు.
మొత్తంగా ఈ ఎన్నికల్లో తేలిందేంటంటే..
→ ద్విముఖ పోరుగా ఉన్న తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలకశక్తిగా మారుతోంది
→ డీఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టిపట్టున్నా ఆ పునాదులను టీవీకే పెకళించే అవకాశాలు మెండుగా ఉన్నాయి
→ జయలలిత మరణం, పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు, పన్నీర్‌సెల్వం ని్రష్కమణ, అంతర్గత విభేదాలతో
అన్నాడీఎంకే ప్రభ కోల్పోయింది
→ విజయ్ పార్టీ శాశ్వతంగా రాష్ట్రరాజకీయాల్లో కీలకభూమిక పోషించే అవకాశం
→ తాజా ఎగ్జిట్‌పోల్ అంచనాలు నిజమైతే టీవీకే పార్టీ తమిళనాట కీలకరాజకీయ శక్తిగా ఎదుగుతుంది. భవిష్యత్తు ఎన్నికల్లోనూ కింగ్‌మేకర్‌గా మారొచ్చు.


