కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. ఒక కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్, అతని భార్యపై వారి ఇంటిలో ఆటో డ్రైవర్ నేతృత్వంలోని 50 మంది గుంపు దాడికి పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ఇంటికి ఆలస్యంగా వచ్చారు.
ఇంతలో దాడికి పాల్పడినవారంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, అతని భార్య కారులో ఇంటికి వస్తుండగా వారి ఇంటి సమీపలో వారి కారును ఒక ఆటో ఢీకొంది. ఈ నేపధ్యంలో ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీతో ప్రదీప్ కుమార్ ఘర్షణకు దిగారు. ఇది జరిగిన కొద్దిసేపటి తరువాత ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీ కొంతమందిని తనతోపాటు తీసుకువచ్చి, ఆ అధికారి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. తరువాత అక్కడ విధ్వంసం సృష్టించారు.
బాధితుడు ప్రదీప్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 50 మంది అతని ఇంటిలోనికి చొరబడి, అతనిని అతని భార్యను దారుణంగా కొట్టారు. తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందుకున్న తర్వాత ప్రదీప్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


