లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
హిందువులు ఏకం కావాలంటూ సాధువుల పిలుపు
కోల్‌కతా: కోల్‌కతా నగరం ఆదివారం కృష్ణ భగవానుని నామ స్మరణతో మార్మోగింది. సాధువులు, సాధ్వీల శంఖారావాలతో కార్యక్రమానికి వేదికైన ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ పరిసరాలు ప్రతి ధ్వనించాయి. సనాతన సంస్కృతి సన్సద్ చేపట్టిన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కు చెందిన స్వామి ప్రదీప్తానంద మహారాజ్ తదితరులు కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
కాషాయ వ్రస్తాలు ధరించిన సాధువులు భగవద్గీతలోని శ్లోకాలను ముక్తకంఠంతో పఠించారు. విశాలంగా నిర్మించిన మూడు వేదికలపై వివిధ ప్రాంతాల నుంచి ధీరేంద్ర శాస్త్రి వంటి పండితులు, గురువులు ఆశీనులయ్యారు. గీతా మనీషి మహామండల్‌కు చెందినస్వామి జ్ఞానానందజీ మహారాజ్ ఆధ్వర్యం వహించారు. తమ కార్యక్రమంతో ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేదని ప్రదీప్తానంద మహారాజ్ చెప్పారు.
ఇక్కడికి దాదాపు నాలుగైదు లక్షల మంది హిందువులు స్వచ్ఛందంగా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తరలివచ్చారన్నారు. బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ తదితర నేతలుæ కార్యక్రమానికి హాజరయ్యారు. హిందువులు ఏకం కాకుంటే, బెంగాల్‌లో ద్వితీయ పౌరులుగా మారే ప్రమాదముందని మజుందార్ అన్నారు.
ఆహా్వనించినా సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడంపై సుకాంత మజుందార్ స్పందిస్తూ..ఆమె అసలు హిందువేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. టీఎంసీ నేతలు స్పందిస్తూ.. అది బీజేపీ నేతలు పాల్గొంటున్న రాజకీయ కార్యక్రమమని పేర్కొన్నారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణానికి పునాది రాయి పడిన మరునాడే జరిగిన ఈ కార్యక్రమానికి యంత్రాంగం భారీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. 2023 డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కోల్‌కతాలో లక్ష గొంతుకల గీతా పారాయణ కార్యక్రమం చేపట్టడం విశేషం.


