
- ఢిల్లీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్
- ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛను కాపాడాలి
- రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలి
సాక్షి జర్నలిస్ట్‌లపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని ఢిల్లీ టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛను కాపాడలని పేర్కొంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ప్రజాస్వామ్యంలో వేధింపులు, అక్రమ కేసులకు తావులేదు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పోలీస్ కేసులు, విచారణ పేరుతో నోటీసులు ఏ మాత్రం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న నెపంతో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి సహా మరికొంత జర్నలిస్టులపై పోలీస్ కేసులు నమోదు చేసి, విచారణ కోసం పోలీస్‌స్టేషన్లకు రమ్మని గంటల తరబడి విచారిస్తూ,వేధింపులకు గురి చేయటం ఏ మాత్రం సమ్మతం కాదు. ముఖ్యంగా ఒక నాయకుడు పెట్టిన ప్రెస్‌మీట్‌పెట్టిన వార్తను ప్రచురించినందుకు ఎడిటర్ సహా, రాసిన విలేకరిపై క్రిమినల్‌కేసు నమోదు చేయటం విచారకరం.
వాస్తవాలకు భిన్నంగా వార్తలు వస్తే, వాటిని తిరిగి ప్రచురించమని, తమ వాదనలు కూడా వేయాలని కోరే హక్కు ప్రభుత్వంతో పాటు అందరికీ ఉంది. కానీ వివరణలు ఇవ్వకుండా జర్నలిస్టులను బెదిరించే ధోరణిలో పోలీస్‌కేసులు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని పదేపదే హితువు పలికింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం పునరాలోచన చేసి పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాము’ అని ఢిల్లీ టీయూడబ్యూజే అధ్యక్షులు నాగిళ్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, కోశాధికారి కొన్నోజు రాజులు ప్రకటనలో పేర్కొన్నారు.
