దేశీయ విమాన సర్వీసులను తగ్గించనున్న ఎయిరిండియా, ఇండిగో | Air India, IndiGo remove over 250 daily flights from domestic routes | Sakshi
Sakshi News home page

దేశీయ విమాన సర్వీసులను తగ్గించనున్న ఎయిరిండియా, ఇండిగో

May 30 2026 4:47 AM | Updated on May 30 2026 4:47 AM

Air India, IndiGo remove over 250 daily flights from domestic routes

ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ: దేశంలోని రెండు అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లు రోజువారీ దేశీయ విమాన సర్వీసులను తగ్గించనున్నాయి.  జూన్‌ నుంచి 250 సర్వీసులను ఉపసంహరించుకుంటున్నట్టు విమానాయన సంస్థలు ప్రకటించాయి. ఇంధన ధరలు పెరిగిపోవడం, ప్రయాణికుల సంఖ్య తగ్గడమే దీనికి కారణంగా తెలుస్తోంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఈ కోతలు కొనసాగున్నాయి. దేశీయ పర్యాటకానికి ఇది అత్యంత కీలకమైన సెలవుల కాలం. ఈ సమయంలో సర్వీసుల తగ్గింపు అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. 

రోజుకు 500 దేశీయ విమానాలను నడిపే ఎయిరిండియా జూన్, జూలై నెలల్లో తన దేశీయ షెడ్యూల్‌లో సుమారు 22% తగ్గిస్తోంది. దీంతో రోజుకు సుమారు 110 విమానాలు తగ్గుతాయి. ఇక, రోజుకు సుమారు 2,200 విమానాలను నడిపే ఇండిగో, తన దేశీయ సామర్థ్యాన్ని 5 నుంచి 7% మేర తగ్గిస్తోంది. ఇవి కూడా రోజుకు దాదాపు 110 సర్వీసులు తగ్గుతాయి. 

ఎయిరిండియా లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కూడా రోజువారీ సుమారు 340 దేశీయ సర్వీసుల్లో దాదాపు 10% కోత విధిస్తోంది. ఈ సర్దుబాట్లు తాత్కాలిక చర్యని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. డిమాండ్, నిర్వహణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. వేసవి తర్వాత వ్యాపారం మందగించిన కాలంలో డిమాండ్‌ తగ్గడమే ఈ కోతకు కీలక కారణమని ఇండిగో పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడిన వెంటనే విమానాలను పునరుద్ధరిస్తామని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.  

దీని కారణంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కీలక వ్యాపార, విహార మార్గాలతో అనుసంధానించి ఉండే ఈ నగరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ముంబై నుంచి జైపూర్, గోవా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, నాగ్‌పూర్, పాటా్న, భోపాల్‌కు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గుతుంది. ఢిల్లీ నుంచి గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, కొచ్చి, కోల్‌కతాకు వెళ్లే విమానాలపై ప్రభావం పడింది. దక్షిణ భారతంలోని ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరు సైతం తిరుగు ప్రయాణ విమానాల తగ్గింపు వల్ల ఇబ్బంది పడనుంది. అయితే, గగనతల ఆంక్షలు సడలించడంతో విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు కొన్ని అంతర్జాతీయ సర్వీసులను పునరుద్ధరించడం కొంత ఊరట.  

ఎందుకు తగ్గిస్తున్నాయి? 
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశీయ కార్యకలాపాలకు ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ ధరలు సుమారు 25%, అంతర్జాతీయ విమానాలకు ఇంకా ఎక్కువగా పెరిగాయి. విమానయాన సంస్థల బడ్జెట్లలో అత్యధిక భాగం ఇంధన ఖర్చులే. సరిగ్గా నెల రోజుల క్రితం, జెట్‌ ఫ్యూయల్‌ ధరల్లో ఈ పెరుగుదల కార్యకలాపాలపై ఒత్తిడిని పెంచింది. ఈ పెరుగుదల విమానయాన సంస్థలను కార్యకలాపాలను హేతుబదీ్ధకరించేలా చేసింది. ఇటీవలి వారాల్లో అనేక మార్గాల్లో ఛార్జీలు ఇప్పటికే 30% పెరిగాయి. ఏటీఎఫ్‌ ఖర్చుల కారణంగా విమానయాన సంస్థలు ప్రతి ప్రయాణికుడికి రూ. 400–450 ఇంధన సర్‌ఛార్జీలను ప్రవేశపెట్టాయి. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో రద్దీ మార్గాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే మూడు నెలల్లో విమాన ప్రయాణం సామాన్యులకు 
అందుబాటులో ఉండకపోవచ్చు.  

Advertisement
 
Advertisement
Advertisement