పశ్చిమాసియా నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో భారీ స్థాయిలో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్ ఇండియా సంస్థ సీఈఓ క్యాంప్ విల్సన్ అన్నారు. గడిచిన మూడు వారాల్లో దాదాపుగా 2,500 విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఫ్లైట్స్ రద్దుతో సంస్థపై పెద్దఎత్తున ఆర్థిక భారం పడుతుందని తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచాన్నే సంక్షోభంలో నెట్టిపడేసింది. చమురు, గ్యాస్ కొరత ఏర్పడడంతో పలు వాణిజ్య సేవలకు ఆటంకం తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా సైతం తన విమానయాన సేవలను గణనీయంగా తగ్గించినట్లు పేర్కొంది.
క్యాంప్ విల్సన్ మాట్లాడుతూ "ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచంతో పాటు ఎయిర్ ఇండియాపై గణనీయంగా పడింది. యుద్ధం మెుదలైన నాటి నుంచి దాదాపుగా 2,500కు పైగా విమానాలు రద్దయ్యాయి. మా సామర్థ్యంలో కేవలం 30 శాతం విమానాలు మాత్రమే నడపగలుగుతున్నాం. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గగనతలం మూసివేయడం భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకున్నాం". అని ఆయన అన్నారు.
అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా విమాన ఇంధన ధరలు రెట్టింపయ్యాయని ఈ ఆర్థిక భారం వచ్చే నెల నుండి ఎయిర్‌ఇండియాపై పడనుందని తెలిపారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్ విధించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విమాన టికెట్ ధరలు మరింతగా పెరిగాయి.


