ఆలయంలో మంత్రి రహస్య తనిఖీ.. అడ్డంగా దొరికిన అర్చకులు! | Action initiated against five temple staff for demanding money from devotees in | Sakshi
Sakshi News home page

ఆలయంలో మంత్రి రహస్య తనిఖీ.. అడ్డంగా దొరికిన అర్చకులు!

May 30 2026 11:43 AM | Updated on May 30 2026 12:25 PM

Action initiated against five temple staff for demanding money from devotees in

సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లాలోని ప్రముఖ మురుగన్‌ ఆలయం తిరుచెందూర్‌ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో వీఐపీ, ప్రత్యేక దర్శనాల పేరిట అర్చకులు, సిబ్బంది భక్తుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హిందూ ధారి్మక దేవదాయ శాఖ మంత్రి రమేష్‌ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయంలో ఒక సామాన్య భక్తుడిలా మారి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లంచం డిమాండ్‌ చేసిన అర్చకులు డిజిటల్‌ ఆధారాలతో సహా మంత్రికి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడం కలకలం రేపింది. 



డిజిటల్‌ చెల్లింపు.. రెడ్‌ హ్యాండెడ్‌ ఆధారాలు 
ప్రస్తుతానికి తన వద్ద నగదు లేదని చెప్పిన మంత్రి, అక్కడి అర్చకుడి గూగుల్‌ పే నంబర్‌కు రూ.4వేలు ఆన్‌ లైన్‌ ద్వారా బదిలీ చేశారు. డబ్బులు అకౌంట్‌లో పడ్డాయని అర్చకులు నిర్ధారించుకున్న మరుక్షణమే, మంత్రి తన ముఖానికి ఉన్న మాస్క్‌ తొలగించి తానెవరో బయటపెట్టారు. డిజిటల్‌ లావాదేవీ ఆధారాలు సహా దొరకడంతో అర్చకులు, వారికి సహకరించిన సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అక్రమాలకు పాల్పడిన అర్చకులను, సిబ్బందిని ఆలయ కార్యాలయానికి పిలిపించి మంత్రి రమేష్‌ వారి నుంచి లిఖితపూర్వక వివరణ లేఖలను తీసుకున్నారు.

ఆ తర్వాత ఆయన అన్నదాన సముదాయానికి వెళ్లి సాధారణ భక్తులతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అక్కడ పంపిణీ చేసే అన్నదాన టోకెన్ల జారీలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి, అక్కడి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. ఆలయ ఆస్తులు, నెలవారీ ఆదాయం, పరిపాలనాపరమైన అంశాలపై కూడా మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఈ వ్యవహారంపై మంత్రి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నెట్‌లో తాజా తనిఖీలకు సంబంధించిన తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయన్నారు. లంచం వసూలు చేసిన వారి నుంచి క్షమాపణ లేఖ తీసుకోలేదని, కేవలం వివరణ లేఖ మాత్రమే కోరామన్నారు. ఆలయ అన్నదానం, ఆస్తుల నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నామని అన్నారు. ఈ విచారణ నివేదిక వచ్చిన తర్వాత, తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే, ఎలాంటి పక్షపాతం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, సామాన్యుడిలా మంత్రి చేసిన ఈ ఆకస్మిక తనిఖీలను ఆలయానికి వచ్చిన భక్తులు అభినందించారు.

ఒక సామాన్య భక్తుడిలా మంత్రి ఎంట్రీ 
మంత్రి రమేష్‌ తన అధికారిక వాహనాన్ని ఆలయ సముదాయానికి దూరంగా నిలిపివేసి, ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ టీషర్ట్, మాస్క్‌ ధరించి తన సహాయకుడితో కలిసి కాలినడకన ఆలయంలోకి ప్రవేశించారు. శీఘ్ర దర్శనం చేసుకోవడానికి ఏం చేయాలని మంత్రి సహాయకుడు అక్కడి అర్చకులను విచారించారు. వచ్చిన వ్యక్తి మంత్రి అని తెలియని అర్చకులు, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నలుగురికి కలిపి మొత్తం రూ.4వేలు ఇస్తే వెంటనే వీఐపీ దర్శనానికి తీసుకెళ్తామని బేరసారాలు మొదలెట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement