నవంబర్, డిసెంబర్‌లలో 46 లక్షల పెళ్లిళ్లు
పెళ్లి సందడి ఖర్చు రూ. 6.5 లక్షల కోట్లు
ఈసారి స్వదేశమే సంపన్నుల ‘డెస్టినేషన్’
కొత్త వేదికల్లో వయనాడ్, కూర్గ్, షిల్లాంగ్
ఈ ఏడాది ఆఖరు రెండు నెలల్లో దేశవ్యాప్తంగా జరగనున్న 46 లక్షల వివాహాల ద్వారా రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సి.ఎ.ఐ.టి.) అంచనా వేస్తోంది. దాని ప్రకారం ఒక్క ఢిల్లీలోనే 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్ల బిజినెస్ జరగనుంది. ఈసారి స్వదేశీ ‘డెస్టినేషన్’లు దేశానికి సరికొత్త పెళ్లి కళ తేబోతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
గత ఏడాదికీ, ఈ ఏడాదికీ పెళ్లిళ్ల సంఖ్యలో పెద్ద తేడా లేనప్పటికీ, పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చు మాత్రం ఈసారి గణనీయంగా పెరగవచ్చని సి.ఎ.ఐ.టి. చెబుతోంది. ఆదాయాల్లో పెరుగుదల; ఆర్థిక రంగం పరుగులు తీయడం, పండుగ సీజన్‌లో రికార్డు స్థాయి కొనుగోళ్లు.. తదితర అంశాలన్నీ కలిసి భారీగా పెళ్లిళ్ల బిజినెస్‌కు దోహదం కావచ్చునని సి.ఎ.ఐ.టి. భావిస్తోంది.
ప్రధాని పిలుపునకు స్పందన
సంపన్న భారతీయులు తమ వివాహాలను దేశంలోనే, దేశవాళీ ఉత్పత్తులతోనే నిర్వహించుకోవాలని గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ‘వెడ్ ఇన్ ఇండియా’ పేరిట పిలుపు ఇచ్చారు. ఆ నేపథ్యంలో కూడా దేశవాళీ పెళ్లిళ్ల బిజినెస్‌లో భారీ పెరుగుదల కనిపించనుందని దేశంలోని 75 ప్రధాన నగరాల్లో సి.ఎ.ఐ.టి. నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
దేశంలోని సంపన్నుల్లో (కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టదగిన ఆస్తులు ఉన్నవారు) 80–85 శాతం మంది ఈసారీ స్వదేశీ డెస్టినేషన్‌ల వైపు మొగ్గు చూపుతున్నారట. వాటిల్లో రాజస్థాన్ ప్యాలెస్‌లు, గోవాలోని రిసార్ట్‌లతో పాటు.. కొత్తగా వయనాడ్, కూర్గ్, రిషికేష్, సోలన్, షిల్లాంగ్‌ల వంటి కొత్త ప్రాంతాలు ఉన్నాయని ప్రముఖ ట్రావెల్ సంస్థ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది.
‘లోకల్’ క్రేజ్
వివాహ వేడుకల కొనుగోళ్లలో రానున్న రెండు నెలల్లో 70 శాతం వరకు దేశీయ ఉత్పత్తులు ఉంటాయని సి.ఎ.ఐ.టి. అంచనా వేస్తోంది. సంప్రదాయ కళాకారులు, ఆభరణాల వ్యాపారులు, దుస్తుల తయారీ యూనిట్లు కూడా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు పొందుతున్నట్లు పేర్కొంది.
రాజస్థాన్‌కు సూపర్ డిమాండ్
రాజస్థాన్‌లో సాంస్కృతిక వారస్వత వైభవం కలిగిన వేదికలు వివాహాలకు అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయి. అక్కడి చాలా హోటళ్లు ముందే బుక్ అయిపోయాయి కూడా. ఈ హోటళ్లు ఈసారి 20–30 శాతం ఎక్కువగా ఆదాయాన్ని చూడబోతున్నాయి. లగ్జరీ రైలు ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ కూడా గత ఏడాది నుండి అందుబాటులోకి రావటంతో ‘డెస్టినేషన్’ పెళ్లిళ్లకు రాజస్థాన్ మరింత ఆకర్షణీయంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు పంచాంగాల ప్రకారం సుమారుగా నవంబరు ఆఖరి వారంలో శుక్ర మూఢమి ప్రారంభమై దాదాపు 80 రోజులకుపైగా ఉంటుంది. ఈ సమయంలో వివాహాలు చేయకూడదన్నమాట. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ నవంబరులో భారీగా వివాహాలు జరుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.
ఏటా పెరుగుతున్న వ్యయం
సి.ఎ.ఐ.టి. డేటా ప్రకారం.. వివాహాలకు భారతీయులు చేస్తున్న ఖర్చు భారీగా పెరుగుతోంది. 2022లో 32 లక్షల వివాహాలకు రూ.3.75 లక్షల కోట్ల ఖర్చు అయితే.. 2023లో 38 లక్షల వివాహాలకు రూ.4.74 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. 2024లో 48 లక్షల వివాహాలకు రూ.5.9 లక్షల కోట్లు వెచ్చించారు.


