దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జీల ఖాళీలు

400 Judicial Vacancies Across High Courts In India - Sakshi

అత్యధికంగా పెండింగ్‌లో ఉన్న 64 హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, కొత్తగా హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని కొన్ని నెలల క్రితం హైకోర్టులు చేసిన సిఫారసులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా తుది తీర్పునివ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీ నాటికి 411 ఖాళీలున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కోలీజియం నుంచి న్యాయమంత్రిత్వ శాఖకు ఇంకా సిఫర్సులు అందలేదన్నారు.

2019 నవంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ అనంతరం సుప్రీంకోర్టులో మొదటి ఖాళీ ఏర్పడిదని, ఆ తరువాత వరుసగా జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ ఆరుణ్‌ మిశ్రాల పదవీ విరమణలతో స్థానాలు ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. మొత్తం 34 మందిని నియమించగా, ప్రస్తుతం 30 మందితో కోర్టు నడుస్తోంది. సుప్రీంకోర్టు లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కొలీజియం నుంచి ఇంత వరకు ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు రాలేదని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామా లేదా, పదోన్నతుల కారణంగా ఇటువంటి ఖాళీలు ఏర్పడతాయి. 

హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం అనేది, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతర ప్రక్రియ. దీనికి వివిధ రాజ్యాంగ అధికారుల నుంచి ఆమోదం అవసరమౌతుంది. 25 హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి, సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, అవసరమైతే అంగీకరిస్తుంది. లేదా పునః పరిశీలిస్తుంది. హైకోర్టు కొలీజియం మొదట తమ సిఫార్సులను న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఐబి నివేదికను వాటికి జతచేస్తుంది. దీన్ని సుప్రీంకోర్టు కొలీజియంకి పంపిస్తారు. ఈ కొలీజియం చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా, సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్‌ న్యాయవాదులను ప్రతిపాదిస్తుంది.  

అయితే 23 మంది అభ్యర్థులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని పలుహైకోర్టు కొలీజియంలు చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా నిర్ణయం తీసులకోలేదని భావిస్తున్నారు. హైకోర్టుల ప్రతిపాదనలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆరోపించారు. ఒక అభ్యర్థి ప్రతిపాదన దాదాపు మూడేళ్ళుగా ఉన్నత న్యాయస్థానం కొలీజియంలో పెండింగ్‌లో ఉంది. మరికొన్ని ప్రతిపాదనలు దాదాపు రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. మరో 47 రికమండేషన్స్‌ సుప్రీంకోర్టు కొలీజియంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీనాటికి 411 ఖాళీలున్నాయి. ఇందులో అత్యధికంగా 64 మంది అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తుల నియమాకాలే పెండింగ్‌లో ఉన్నాయి.  

కొలీజియం సిఫార్సులను బట్టి ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఖరారు చేయడంలో కేంద్రం వైపు నుంచి జరిగిన ఆలస్యంపై బుధవారం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. కొన్ని కేసుల్లో కేంద్రం కొలీజియం సూచనలపై ప్రతిస్పందించేందుకు కేంద్రం ఏడాదికి పైగా సమయం తీసుకుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top